
గురు గ్రంథ్ సాహిబ్ ను అవమానిస్తే జీవిత ఖైదు
సిక్కుల పరమ పవిత్ర గ్రంథం 'శ్రీ గురు గ్రంథ్ సాహిబ్' పట్ల జరిగే అవమానకర (సక్రిలేజ్) ఘటనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇటువంటి నేరాలకు పాల్పడే వారికి కఠినాతికఠినమైన శిక్షలు విధిస్తూ రూపొందించిన 'జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ (సవరణ) బిల్లు, 2026' కు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లులో నేరస్థులకు గరిష్ఠంగా జీవిత ఖైదుతో పాటు రూ.25 లక్షల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలను అడ్డుకోవడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ సవరణ బిల్లు ప్రకారం పవిత్ర గ్రంథానికి సంబంధించిన 'సరూప్ ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసినా తగలబెట్టినా లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా మత భావాలను కించపరిచినా కనీసం 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడితే ఆ శిక్షను జీవిత ఖైదు వరకు పెంచుతూ రూ.25 లక్షల జరిమానాను ఖరారు చేశారు. ఈ నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారికి సైతం 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష తప్పదని బిల్లులో పేర్కొన్నారు. ఈ కేసుల దర్యాప్తు బాధ్యతను డీఎస్పీ లేదా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారికి అప్పగించనున్నారు.
పవిత్ర గ్రంథం పంపిణీలో పారదర్శకత కోసం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రతి 'సరూప్' ముద్రణ, పంపిణీ నిల్వ వివరాలతో కూడిన ఒక కేంద్ర రిజిస్టర్‌ను నిర్వహించాలని ప్రతి ప్రతికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని ఆదేశించింది. ఈ వివరాలను డిజిటల్ రూపంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. గతంలో ఇటువంటి బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో పడిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం భగవంత్ మాన్ ప్రస్తుత సవరణలు కేవలం రాష్ట్ర పరిధిలోనివి కావడంతో గవర్నర్ ఆమోదం పొందితే సరిపోతుందని సభకు వివరించారు.
కాగా అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూనే గతంలో జరిగిన సక్రిలేజ్ ఘటనలపై జరుగుతున్న విచారణల పురోగతిని ప్రశ్నించారు. ఈ చట్టం భవిష్యత్తులో దుశ్చర్యలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుందని శాసనసభ అభిప్రాయపడింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడిన సమయంలో పలువురు మత పెద్దలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు గ్యాలరీలో ఉండి సభా దృశ్యాన్ని వీక్షించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ అడుగు అనివార్యమని ప్రభుత్వం ఉద్ఘాటించింది.
