Let's talk: editor@tmv.in
‘గురుకుల’ కాంట్రాక్టర్లకు

‘గురుకుల’ కాంట్రాక్టర్లకు

Aravind Maryada Reddy
29 సెప్టెంబర్, 2025

గురుకుల విద్యాలయాలకు నిత్యవసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఎందుకు ఆరు నెలలుగా పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే, గురుకులకు ఆహార పదార్థాలు ఎలా సరఫరా చేస్తారు? పిల్లలకు నాణ్యమైన భోజన ఎలా అందిస్తారు? అంటూ ఆయన మండిపడ్డారు. కొందరు కాంట్రాకర్లు ఆదివారం హరీశ్ రావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వాళ్ల ప్రశ్నలను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. కల్తీ ఆహారంతో గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలై ప్రాణాలు వదులుతుంటే..ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయమని హరీశ్ రావు మండిపడ్డారు.

గురుకుల విద్యార్థులు పస్తులు ఉండకూడదన్న బాధ్యతతో కాంట్రాక్టర్లు అప్పులు తీసుకొచ్చి మరీ భోజనాలు పెడుతున్నారన్నారు. దీంతో వారి అప్పులు పెరిగి, కుటుంబ సభ్యులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. సుమారు 5000 మంది సరఫరాదారులకు బతుకమ్మ, దీపావళి పండగ సంబరం లేకుండా చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ‘అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలని గోడు వెళ్లబోసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి కదలిక లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి 6 నెలలుగా ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలి.’ అంటూ హరీశ్ రావు డిమాండ్ చేశారు.

అనేకరోజులుగా సమస్యలుగురుకుల పాఠశాలలకు సంబంధించి చాలా రోజులుగా సమస్యలు బయటపడుతున్నాయి. విద్యార్థులకు సరైన ఆహారం అందుబాటులో ఉండటం లేదని.. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని హరీశ్ రావు ప్రస్తావించడం గమనార్హం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఈ సమస్యలు ఉండేవా? లేదంటే ఇప్పుడే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయ్యాయా? అన్న చర్చ కూడా సాగుతోంది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు గురుకుల పాఠశాలల సంఖ్య 200-300 మధ్య ఉండేది. బీఆర్ఎస్ పాలనలో (2014-2023) ఈ సంఖ్య 1,024కి చేరింది, విద్యార్థులు 1.9 లక్షల నుంచి 6.5 లక్షలకు పెరిగింది. 'మన ఊరు-మన బడి' కార్యక్రమం ద్వారా భవనాలు, సదుపాయాలు మెరుగుపడ్డాయని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ పాలనలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఆర్థిక సంక్షోభమే కారణమా?

2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' పేరుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కొత్త గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో ఆహార ఖర్చు 40% పెంచారు. మెడికల్ కాస్మెటిక్ ఖర్చులు 200% పెంచుతున్నట్టు చెప్పారు. 7.66 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకున్నారు. 2025 జూలైలో నలుగురు గురుకులాల్లో (పెద్దకొత్తపల్లి, లక్ష్మీపూర్, భద్రాచలం) వంటి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు.

ప్రభుత్వం 'గురుకుల విద్యార్థులకు మేలు చేస్తున్నాం' అని చెప్పినప్పటికీ, కొన్ని చోట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బిల్లులు మంజూరు కాకపోవడం వల్ల కాంట్రాక్టర్లు సరుకులు ఆపేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కమీషన్ల కోసమే బిల్లులు ఆలస్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.

‘గురుకుల’ కాంట్రాక్టర్లకు - Tholi Paluku