
గురుకులాల్లో కలుషిత ఆహారం: ప్రభుత్వంపై హరీష్‌రావు ఆగ్రహం
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలపై మాజీ మంత్రి, హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ లతో కలిసి పరామర్శించారు. విద్యార్థులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రోజుకో గురుకుల పాఠశాలలో లేదా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రిపాలవుతున్న పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల షామీర్‌పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు. నిన్న మాదాపూర్‌లోని చందు నాయక్ తండాలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని, తాజాగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకులంలో 90 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారని ఆయన తెలిపారు.
విజన్ 2047 కాదు.. పాయిజన్ 2047
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘విజన్ 2047’ అంటూ ప్రచారం చేసుకుంటోందని, కానీ ఇది విద్యార్థుల పాలిట ‘పాయిజన్ 2047’గా మారిందని హరీష్ రావు విమర్శించారు. టీవీ యాడ్లు, పేపర్ యాడ్లలో ‘తెలంగాణ రైసింగ్’ అని చెప్పుకుంటూ వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటళ్లలో పడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేంట్లో రైసింగ్? అవినీతిలో, అరాచకంలో, అహంకారంలో లేక కబ్జాలో రైసింగ్, అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం అందేదని, ఇప్పుడు దొడ్డు బియ్యం పెట్టడంతో అన్నం సరిగా ఉడకడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఫుట్‌బాల్ సోకులకు కోట్లు.. విద్యార్థులకు తిండి లేదు
మెస్సితో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పిల్లలకు కనీసం కడుపునిండా భోజనం పెట్టలేకపోతోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు మేస్త్రి (ముఖ్యమంత్రి) కోట్లు ఖర్చు చేస్తున్నాడు.. పిల్లలకు మాత్రం తిండి పెట్టడం లేదు. 5 కోట్లతో స్టేడియం కట్టించుకున్నాడు. 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్‌బాల్ ఆడడం ఎందుకు రేవంత్ రెడ్డి? ఆ డబ్బుతో ఒక పూట కడుపునిండా అన్నం విద్యార్థులకు పెట్టలేవా? అని ప్రశ్నించారు.
61 సార్లు ఢిల్లీకి వెళ్లడానికి టైమ్ ఉంది కానీ, ఆసుపత్రి పాలైన విద్యార్థులను పరామర్శించడానికి టైమ్ లేదా అని నిలదీశారు. కనీసం చీమ కుట్టినట్టైనా లేదని మండిపడ్డారు.20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని చెప్పే వరకు పిల్లలు బతికి ఉండే పరిస్థితి ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసుపత్రిలో చేరిన విద్యార్థులను పరామర్శించలేదని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీ తీరుపై ధ్వజం
రాహుల్ గాంధీ పర్యటనపై కూడా హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.300 మంది రైతులు, 160 మంది ఆటో డ్రైవర్లు, 116 మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. కానీ ఫుట్‌బాల్ చూడడానికి ప్రత్యేక విమానంలో వస్తున్నాడని ఆయన విమర్శించారు. కలుషిత ఆహారంతో కడుపునొప్పి భరించలేక ఏడుస్తున్న విద్యార్థుల కన్నీళ్లు చూడు రాహుల్ గాంధీ. పురుగుల అన్నం తిని పిల్లలు ఆగమైతుంటే, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగే తెలివి, బాధ్యత లేదా, అని హరీష్ రావు నిలదీశారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాఫ్ అయ్యారని, హాస్టల్ పిల్లలకు ముందు పురుగులు లేని అన్నం పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
