Let's talk: editor@tmv.in
గురుకులాలు, వర్సిటీల్లో ఫుడ్ పాయిజన్ కలకలం: రోడెక్కిన విద్యార్దులు

గురుకులాలు, వర్సిటీల్లో ఫుడ్ పాయిజన్ కలకలం: రోడెక్కిన విద్యార్దులు

Dantu Vijaya Lakshmi Prasanna
13 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహార భద్రత గాలిలో దీపమైంది. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎస్టీ ఆశ్రమ పాఠశాల మొదలుకొని, భాగ్యనగరంలోని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ వరకు కల్తీ ఆహారం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. వరుస ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రోడ్లెక్కగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ విఫలం అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. .

ఆశ్రమ పాఠశాలల్లో అగచాట్లు - విద్యార్థుల ఆందోళన

సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం వెంకటాపూర్ ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పురుగుల అన్నం, నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ చిన్నారులు నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. "మాకు కల్తీ భోజనం వద్దు.. స్వచ్ఛమైన ఆహారం కావాలి" అంటూ వారు చేసిన నినాదాలు ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతున్నాయి. అంటూ ఆ వీడియోలను బీఆర్ఎస్ నేత హరీష్ రావు తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఉస్మానియాలో రాత్రిపూట నిరసన జ్వాలలు

మరోపక్క, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏంలేదు. హాస్టళ్లలో వడ్డిస్తున్న భోజనం అధ్వాన్నంగా ఉండటంతో విద్యార్థినులు బుధవారం రాత్రి నుండి నిరసన కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యూనివర్సిటీకి వచ్చి రిబ్బన్లు కట్ చేయడంపై చూపే ఆసక్తి విద్యార్థుల కనీస అవసరాలను తీర్చడంలో చూపడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ హరీష్ రావు పేర్కొన్నారు.

కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. నిత్యం గాలి మోటార్లలో తిరుగుతూ, ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రికి, సొంత రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 60 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి, కేంద్ర బడ్జెట్‌లో సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకం?

ఉన్న గురుకులాల్లో పిల్లలకు కడుపునిండా పురుగుల్లేని అన్నం పెట్టలేని ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయి వసతులతో 'యంగ్ ఇండియా స్కూల్స్' నిర్మిస్తామనడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ విమర్శించింది. అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికే ఇలాంటి భారీ పథకాలకు తెరలేపారని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గాలికొదిలేశారని ఆరోపించింది.

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?

పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు రోడ్డెక్కి పోరాడటమేనా మీరు చెబుతున్న 'ఇందిరమ్మ రాజ్యం' అని బీఆర్ఎస్ పార్టీ తరపున హరీష్ రావు ఎక్స్ వేదికగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు,. ఉస్మానియా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కనీస గౌరవం ఇవ్వని ఈ పాలన ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. పరిపాలన అంటే కేవలం ప్రతిపక్షాలపై బూతుల వర్షం కురిపించడం కాదని, బాధ్యతాయుతంగా ఉండాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు హితవు పలికారు.

హార్వార్డ్ వంటి అంతర్జాతీయ యూనివర్సిటీలు సందర్శించి వచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా ఉండటం శోచనీయమని, ఇప్పటికైనా విద్యాశాఖపై దృష్టి సారించి, గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించాలని, ఉస్మానియాలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో బీఆర్ఎస్ తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.