
గుడ్లు తినడం సురక్షితమే:ఎఫ్ఎస్ఎస్ఏఐ
గుడ్ల వినియోగం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉంటుందనే ప్రచారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పూర్తిగా కొట్టిపారేసింది. దేశంలో విక్రయించే గుడ్లు మానవ వినియోగానికి పూర్తిగా సురక్షితమైనవేనని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో గుడ్లలో నైట్రోఫ్యూరాన్ మెటబొలైట్స్ (ఏవోజడ్) ఉన్నాయని, అవి క్యాన్సర్‌కు కారణమవుతాయని వచ్చిన ఆరోపణలు శాస్త్రీయ ఆధారాలు లేనివి, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేవి అని తెలిపింది.
గుడ్లు, కోళ్ల పెంపకం సహా అన్ని దశల్లో నైట్రోఫ్యూరాన్‌ల వినియోగం పూర్తిగా నిషేధితమని, 2011 నాటి ఆహార భద్రతా నిబంధనల్లో స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ పదార్థాల కోసం నిర్ణయించిన ఎక్స్‌ట్రేనియస్ మాక్సిమమ్ రెసిడ్యూ లిమిట్ (ఈఎంఆర్ఎల్) 1.0 మైక్రోగ్రాం/కిలోగ్రాం అనేది కేవలం నియంత్రణ, అమలు పరమైన ప్రమాణమే తప్ప అనుమతించిన మోతాదు కాదని వివరణ ఇచ్చారు. ఈఎంఆర్ఎల్ కంటే తక్కువ స్థాయిలో అవశేషాలు గుర్తించడమే ఆహార భద్రతా ఉల్లంఘన కాదని, అలాగే అది ఆరోగ్యానికి ముప్పుగా పరిగణించరాదని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే నిబంధనలు
భారతదేశ ఆహార భద్రతా నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపిన ఎఫ్ఎస్ఎస్ఏఐ , యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల్లో కూడా నైట్రోఫ్యూరాన్‌ల వినియోగం నిషేధమేనని గుర్తు చేసింది. దేశాల మధ్య కనిపించే సంఖ్యా పరమైన తేడాలు వినియోగదారుల భద్రతలో తేడా కాదని, పరీక్షా విధానాల్లో తేడాల వల్లే వస్తాయని పేర్కొంది.
ప్రజారోగ్య అంశాలపై స్పందిస్తూ, గుడ్లను సాధారణంగా వినియోగించడం వల్ల క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన వ్యాధులు వస్తాయని నిర్ధారించే ఎలాంటి జాతీయ లేదా అంతర్జాతీయ శాస్త్రీయ ఆధారాలు లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ పునరుద్ఘాటించింది. కొన్ని గుడ్ల బ్రాండ్లపై వచ్చిన పరీక్షా నివేదికలు ఒంటరి బ్యాచ్‌లకు మాత్రమే సంబంధించినవని, అవి ఫీడ్ లేదా అనుకోని కలుషితం కారణంగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని మొత్తం గుడ్ల సరఫరా వ్యవస్థను సురక్షితమైనవి కావని ముద్ర వేయడం శాస్త్రీయంగా తప్పు అని అన్నారు. ప్రజలు వదంతులు నమ్మకుండా అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన శాస్త్రీయ సమాచారంపైనే ఆధారపడాలని సూచించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ, గుడ్లు సురక్షితమైన, పోషకాహారంలో కీలకమైన ఆహార పదార్థమేనని స్పష్టం చేసింది.
