Let's talk: editor@tmv.in
గుజరాత్ సీఎంను కలిసిన శుభాంశు శుక్లా

గుజరాత్ సీఎంను కలిసిన శుభాంశు శుక్లా

Pinjari Chand
10 అక్టోబర్, 2025

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ను గురువారం భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా కలిశారు.ఉత్తర గుజరాత్‌లోని మేహసానా జిల్లా ఖెర్వాలోని గణపత్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్ తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్లా ముఖ్యమంత్రి పటేల్ వ్యక్తిగతంగా కలిశారు. సీఎం భూపేంద్ర పటేల్ శుక్లా అంతరిక్ష ప్రయాణ వివరాలు అడిగి తెలుసుకుని, ప్రయాణం విజయవంతం కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ,యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్‌ ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్‌, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో వన్-టు-వన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పేస్ టెక్నాలజీ, రక్షణ రంగాలలో (డిఫెన్స్ సెక్టర్స్) గుజరాత్ రాష్ట్రం వేగంగా విస్తరిస్తున్న అవకాశాలను వివరించారు. దీవ్–వేర్వల్ తీరప్రాంతంలో భారత్‌లో రెండవ అతిపెద్ద స్పేస్‌పోర్ట్‌ను స్థాపించాలనే ఇస్రో ప్రణాళిక గురించి ప్రస్తావిస్తూ, ‘వికసిత గుజరాత్ 2047’ విజన్‌ సాధనలో స్పేస్ ఎకానమీ ఒక మార్గదర్శక శక్తిగా నిలుస్తుందని తెలిపారు.భారతదేశం అంతరిక్ష రంగ అభివృద్ధిలో ఇస్రో చేసిన అపూర్వమైన కృషిని ఆయన ప్రశంసించారు.

విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ బిల్డాథాన్’

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతిఆయోగ్ సంయుక్తంగా ప్రారంభించిన ‘వికసిత్ భారత్ బిల్డాథాన్ 2025’కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం, దేశంలోని సుమారు 2.5 లక్షల పాఠశాలల విద్యార్థులు ఈ జాతీయ ఆవిష్కరణ పోటీలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అత్యంత పెద్ద విద్యార్థుల ఇన్నోవేషన్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది.

విద్యార్థులకు శుభాంశు శుక్లా సందేశం

ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న శుభాంశు శుక్లా వీడియో సందేశం ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ప్రతి చిన్న ఆలోచనకూ విలువ ఉంది. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి, వాస్తవ జీవిత సమస్యలకు పరిష్కారాలు చూపే అభివృద్ధి నమూనాలు తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ‘వోకల్ ఫర్ లోకల్’ స్వదేశీ ఆవిష్కరణల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రూ. 1 కోటి బహుమతులు

6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఫోటోలు, వీడియోల రూపంలో సమర్పించాలి.నిపుణుల బృందం వాటిని పరిశీలించి ఉత్తమ బృందాలకు రూ. 1 కోటి విలువైన బహుమతులు అందజేస్తుంది.

గుజరాత్ సీఎంను కలిసిన శుభాంశు శుక్లా - Tholi Paluku