
గుజరాత్ లో 28 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్
గుజరాత్‌లోని అహ్మదాబాద్, వడోదరా నగరాల్లో కనీసం 28 పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. వెంటనే ఆయా పాఠశాలలను ఖాళీ చేయించి, భద్రతా తనిఖీలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని చెప్పారు. అహ్మదాబాద్‌లో 15కి పైగా పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రోహిత్ చౌధరి తెలిపారు. అన్ని పాఠశాలల యాజమన్యాలు సమీప పోలీస్ స్టేషన్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని, భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించామని ఆయన మీడియాతో చెప్పారు.
వడోదరా పోలీస్ కమిషనర్ నరసింహ కొమార్ తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 13 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాలల యాజమాన్యాలు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో, స్థానిక పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), క్రైమ్ బ్రాంచ్, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్) బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తొమ్మిది పాఠశాలల్లో శానిటైజేషన్ ప్రక్రియ పూర్తైంది. మిగిలిన పాఠశాలల్లో కొనసాగుతోంది. ఈ-మెయిల్స్ సోర్స్, పంపిన వారి గుర్తింపు తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని కొమార్ చెప్పారు. మొదట ఇవి అల్లరి చర్యలుగా కనిపిస్తున్నప్పటికీ, పోలీస్ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుంటుందని తెలిపారు.
వడోదరా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) హిమాన్షు వర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదు. ప్రభావిత పాఠశాలల విద్యార్థులను ఇంటికి పంపించారు. లక్ష్యంగా చేసుకున్న పాఠశాలల్లో అహ్మదాబాద్‌లోని డీఏవీ ఇంటర్నేషనల్ స్కూల్, ఏషియా స్కూల్, అంకూర్ ఇంటర్నేషనల్ స్కూల్, సంత్ కబీర్ స్కూల్, అలాగే వడోదరాలోని డి.ఆర్. అమిన్ స్కూల్, ఉర్మి స్కూల్, బరోడా హైస్కూల్, డాన్ బోస్కో తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. గత జనవరి 23న కూడా అహ్మదాబాద్‌లోని కొన్ని పాఠశాలలకు ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ తరువాత అవి వదంతులేనని తేలింది.
