
గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా జగదీష్ విశ్వకర్మ
గుజరాత్ రాష్ట్ర మంత్రి, ఓబీసీ నాయకుడు జగదీష్ విశ్వకర్మ శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికల కోసం పార్టీ నియమించిన ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా విశ్వకర్మ పేరును ప్రకటించారు.
52 ఏళ్ల విశ్వకర్మ, కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టనున్నారు. పాటిల్ మూడేళ్ల పదవీకాలం జూలై 2023తో ముగిసినప్పటికీ, ఆయనే ఇప్పటి వరకూ కొనసాగారు. అహ్మదాబాద్‌లోని నికోల్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విశ్వకర్మ, అధ్యక్ష పదవికి శుక్రవారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ప్రస్తుతం విశ్వకర్మ సహకార, ఉప్పు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, కుటీర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆయన బీజేపీ అహ్మదాబాద్ నగర శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
గుజరాత్ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన విశ్వకర్మ, అహ్మదాబాద్‌లోని ఠక్కర్‌బాపానగర్‌లో ఉన్న తన నివాసం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా సేవ చేసే బాధ్యతను తనకు అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 25 ఏళ్లుగా గుజరాత్ ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసం ఈ బాధ్యతను మరింత పెంచిందని విశ్వకర్మ అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ, తన నాయకత్వంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలను గెలవాలనే లక్ష్యంతో బీజేపీ పోటీ చేసి, 156 స్థానాలను గెలుచుకుందని తెలిపారు. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 26 స్థానాలకు గాను 25 స్థానాలు గెలిచిందని చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రతిపక్షాల మూడు లక్షల ఓట్ల ఆధిక్యంతో పోలిస్తే, బీజేపీకి కోటి ఓట్లకు పైగా ఆధిక్యం లభించిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైన 39 మంది బీజేపీ జాతీయ మండలి సభ్యుల పేర్లను కూడా ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఆర్ పాటిల్, సీఎం భూపేంద్ర పటేల్, సీనియర్ నాయకులు వజు వాలా, పర్షోత్తం రూపాలా, ఆర్‌సీ ఫాల్దు వంటి వారు ఈ మండలిలో సభ్యులుగా ఉన్నారు. కాగా గుజరాత్ రాజకీయాల్లో ఈ కొత్త నాయకత్వ మార్పు ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది చూడాలి మరి.
