
గుజరాత్ ఓటర్ల జాబితాలో 17 లక్షల మందికి పైగా చనిపోయిన ఓటర్లు: 'ఎస్‌ఐఆర్'లో వెల్లడి
గుజరాత్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. రాష్ట్రంలోని ప్రస్తుత ఓటర్ల జాబితాలో 17 లక్షల మందికి పైగా చనిపోయిన ఓటర్ల పేర్లు ఇంకా ఉన్నట్లు గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
గుజరాత్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నవంబర్ 4న ప్రారంభమైంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాలలో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రచారం డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు ఓటర్ల జాబితాలో నమోదైన 5 కోట్ల మందికి పైగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. చాలా జిల్లాల్లో 100 శాతం పంపిణీ పూర్తయింది. తిరిగి వచ్చిన ఫారాలను డిజిటలైజ్ చేసే పని ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 12 నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ పూర్తయింది. ఈ పనిలో డాంగ్ జిల్లా 94.35 శాతం పురోగతితో ముందుంది.
సవరణలో బయటపడిన ప్రధాన లోపాలు
ఈ 'ఎస్‌ఐఆర్' ప్రక్రియలో ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, అక్రమాలు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల మందికి పైగా చనిపోయిన ఓటర్ల పేర్లు ఇంకా జాబితాలో ఉన్నాయి. 6.14 లక్షల మందికి పైగా ఓటర్లు తమ చిరునామాల్లో అందుబాటులో లేరు. 30 లక్షలకు పైగా ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు గుర్తించారు. 3.25 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో ఉన్నట్లు బీఎల్‌ఓలు గుర్తించారు. కాగా ఈ లోపాల వల్ల, ఓటర్ల జాబితాను శుద్ధి చేయాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ ద్వారా స్పష్టమైంది. ఈ వివరాలను సరిచేసి, తుది ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
