Let's talk: editor@tmv.in
గుజరాత్‌లో కొలువుదీరిన నూతన మంత్రివర్గం

గుజరాత్‌లో కొలువుదీరిన నూతన మంత్రివర్గం

Shaik Mohammad Shaffee
18 అక్టోబర్, 2025

దీపావళి పండుగకు ముందు గుజరాత్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం కేబినెట్ విస్తరణ అట్టహాసంగా జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో హర్ష్ సంఘవి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయగా, స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. గురువారం అనూహ్యంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా 16 మంది మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే కొన్ని గంటల వ్యవధిలోనే 21 మందితో కొత్త కేబినెట్ ఏర్పాటు జరిగిపోవడం గమనార్హం.

గుజరాత్‌ గాంధీ నగర్‌లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ వీరిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

కొత్త మంత్రివర్గం వివరాలు

హర్ష్ సంఘవి (ఉప ముఖ్యమంత్రి) కాకుండా మొత్తం ఐదుగురు క్యాబినెట్ మంత్రులు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర హోదా), పన్నెండు మంది రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఉప ముఖ్యమంత్రి: హర్ష్ సంఘవి

క్యాబినెట్ మంత్రులు: జితేంద్రభాయ్ వాఘాని, నరేష్‌భాయ్ పటేల్, అర్జున్‌భాయ్ మోధ్వాడియా, డాక్టర్ ప్రద్యుమన్‌భాయ్ వాజా, రమణ్‌భాయ్ సోలంకి.

రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర హోదా): ఈశ్వర్‌సింగ్ పటేల్, ప్రఫుల్‌భాయ్ పన్షేరియా, మనీషా వకీల్.

రాష్ట్ర మంత్రులు: కాంతిలాల్ అమృతియా, రమేష్‌భాయ్ కతారా, దర్శనబెన్ వాఘేలా, కౌషిక్‌భాయ్ వేకారియా, ప్రవీణ్‌కుమార్ మాలి, డాక్టర్ జయరాంభాయ్ గమిత్, త్రికంభాయ్ ఛంగా, కమలేష్‌భాయ్ పటేల్, సంజయ్‌సింగ్ మహిదా, పి సి బరాండా, స్వరూప్‌జీ ఠాకూర్, రివాబా జడేజా.

కనుభాయ్ దేశాయ్, ఋషికేశ్‌భాయ్ పటేల్, కున్వర్జీభాయ్ బవాలియా, పర్షోత్తంభాయ్ సోలంకి పాత మంత్రివర్గంలో ఉన్నవారే. కొత్త క్యాబినెట్‌లోనూ వీరికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ, కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో గరిష్టంగా 27 మంది మంత్రులు ఉండవచ్చు. ఇంతకు ముందు ఉన్న మంత్రివర్గంలో మొత్తం 17 మంది సభ్యులు ఉన్నా.. ఎనిమిది మంది కేబినెట్ హోదాను కలిగి ఉండగా, మిగిలినవారు సహాయ మంత్రులుగా పనిచేశారు. తాజాగా 26 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగింది. గుజరాత్‌లో పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేయడం, పరిపాలనలో కొత్త శక్తిని నింపడానికి మంత్రివర్గ విస్తరణ జరిగినట్లుగా తెలుస్తోంది.