
గుజరాత్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని బహియల్ ప్రాంతంలో అక్రమ ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. గాంధీనగర్ ఎస్పీ రవి తేజ వాసంశెట్టి ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘ఉదయం నుంచి అక్రమనిర్మాణాల కూల్చివేత మొదలుపెట్టాం. గత 10 రోజుల్లో మొత్తం 186 అక్రమ నిర్మాణాలను గుర్తించాం. ఈ అక్రమ కట్టడాల యజమానుల మీద అనేక కేసులు ఉన్నాయి. ఈ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసిన తర్వాత, కూల్చివేత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈ నిర్మాణాలలో 50 మంది యజమానులు నేరుగా నేరాల్లో పాల్గొన్నారు. వారిపై కేసులు నమోదు చేశాం. 30 మంది వ్యక్తులు కొందరు బంధువుల ద్వారా లేదా పరోక్షంగా నేరాల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల నుండి 1000 మంది పోలీసు సిబ్బందిని నియమించాము.’ అని తెలిపారు. మొత్తం 186 నిర్మాణాలను గుర్తించి, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు బుల్డోజర్ల ద్వారా కూల్చివేతలు చేపట్టారు.
గోద్రాలోనూ..
గురువారం గోద్రాలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన 33 అక్రమ ఆస్తులను అధికారులు కూల్చివేశారు. గాంధీనగర్ జిల్లా పరిపాలన, జిల్లా పోలీసుల సహకారంతో, తెల్లవారుజామున జేఈబీ, పెథాపూర్, చరేడి, సబర్మతి నది తీరంలోని ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు విస్తృతమైన కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూములపై నిర్మించిన 700కిపైగా అనధికార నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని ఈ కూల్చివేతలు కొనసాగాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లోని రాయ్ బుజుర్గ్ గ్రామంలో అక్రమంగా నిర్మించిన వివాహ మండపంపై కూల్చివేత కార్యక్రమం నిర్వహించబడింది.
సంభల్ ఎస్పీ కేకే బిష్ణోయ్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్లు 30 రోజుల గడువులో చర్య తీసుకోకపోవడంతో పరిపాలన ఈ కూల్చివేతను అమలు చేసిందని తెలిపారు. "సంభల్‌లోని అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్ బుజుర్గ్ గ్రామంలో చెరువు, కంపోస్ట్ గుండాల కోసం భూమి ఉంది. వారికి కూల్చివేయడానికి 30 రోజుల గడువు ఇవ్వబడింది. 30 రోజుల గడువు ముగిసినప్పటికీ, వారు ఇంకా కూల్చలేదు. ఇది అక్రమ నిర్మాణం. వారికి తగినంత సమయం ఇచ్చాం. డ్రోన్ ద్వారా నిఘా కొనసాగుతోంది. వారు ఆ స్థలాన్ని మదరసా గా కొనసాగిస్తున్నారు.‘ అని బిష్ణోయ్ తెలిపారు.
గతంలోనూ కూల్చివేతలు
గుజరాత్‌లో ఇటువంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు (బుల్డోజర్ డ్రైవ్‌లు) గతంలోనూ జరిగాయి. ఇవి ప్రభుత్వ భూములు, నదీ తీరాలు, మతపరమైన స్థలాలు, పబ్లిక్ ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు చేపట్టారు. 2024, 2025లో ఇటువంటి డ్రైవ్‌లు తీవ్రంగా జరిగాయి. ముఖ్యంగా అమ్దావాద్, గాంధీనగర్, సోమనాథ్, సురత్ వంటి ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు నిర్వహించారు. 2024 జులైలో రాష్ట్రవ్యాప్తంగా 503 అక్రమ మతపరమైన నిర్మాణాలు (మసీదులు, దర్గాలు, కబర్‌స్తాన్‌లు) కూల్చివేశారు. 2024 ఫిబ్రవరిలో 108 అక్రమ నిర్మాణాలు ధ్వంసం చేశారు. సోమనాథ్ ఆలయం సమీపంలోని ఆక్రమణలు కూడా ఇందులో భాగమే. అమ్దావాద్‌లో చండోలా లేక్ ప్రాంతంలో 11 వేలకుపైగా అక్రమ ఇళ్లు కూల్చివేశారు. 402 హెక్టార్ల భూమి తిరిగి స్వాధీనం చేసుకున్నారు.2024, సెప్టెంబర్‌లో సోమనాథ్ ఆలయం సమీపంలో అక్రమ మసీదు, 500 సంవత్సరాల పాత కబర్‌స్తాన్ ను కూల్చివేశారు.
బీజేపీ వ్యతిరేకుల ఇండ్లే కూల్చివేశారా?
అయితే బీజేపీ వ్యతిరేకులు, ఓ వర్గం వారి అక్రమనిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వం ఈ డ్రైవ్‌లను 'న్యాయమైన', 'చట్టపరమైన' ఆక్రమణ తొలగింపుగా చెబుతోంది. నోటీసులు జారీ చేసి, పోలీసుల సహకారంతో అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా కూల్చివేతలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాంతంలోనే జరిగాయి. సోమనాథ్ ఆలయం సమీపంలో మసీదు, దర్గాలు కూల్చివేతలు సుప్రీం కోర్టులో సవాలు చేయబడ్డాయి. రాహుల్ గాంధీ వంటి నాయకులు ముస్లింలు, పేదలను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ లేదా ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం బీజేపీయేతర నేతలే ఇండ్లే కూల్చివేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నేతలు ఎక్కడా అక్రమనిర్మాణాలు చేపట్టడం లేదా? వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం అంతా చట్టబద్ధంగానే చేస్తున్నామని సమర్థించుకుంటున్నారు.
