
గుచ్చిమి ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మన్యంలో దశాబ్దాలుగా వేధిస్తున్న మానవ–ఏనుగు సంఘర్షణకు శాస్త్రీయ పరిష్కారంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన ‘కుంకీ ఏనుగుల శిబిరాన్ని’ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకృతి మనిషికి చెందింది కాదని, మనుషులే ప్రకృతిలో భాగమని పేర్కొన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉంటేనే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతేనని, అదే ఆలోచనతో గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో పాటు స్థానికులు ఏనుగుల సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని, గ్రామాల్లోకి చొరబడుతున్న అడవి ఏనుగుల వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది ఉత్తరాంధ్రలో మానవ–ఏనుగు సంఘర్షణల నివారణకు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో పలమనేరు ప్రాంతంలో కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యుతో చేపట్టిన ఆపరేషన్లు విజయవంతమయ్యాయని, ఆధునిక సాంకేతికత వినియోగంతో మానవ–ఏనుగు సంఘర్షణల వల్ల జరిగే మరణాలను 70 శాతానికి పైగా తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా గణనీయంగా నియంత్రించగలిగామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే విజయాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పునరావృతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కర్ణాటక ప్రభుత్వానికి, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు
తెలుగు ప్రజల రక్షణ కోసం నాలుగు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను పంపించిన కర్ణాటక ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహకారానికి గాను కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె. అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు.
