
గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనంకు మార్గం సుగమం
నంద్యాల,మార్కాపురం జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన నల్లమల అరణ్యంలో వెలసిన చారిత్రక శైవక్షేత్రం శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగి మార్గం సుగమమైంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల విజ్ఞప్తి మేరకు ఉప ముఖ్యమంత్రి,అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రెండు రోజుల పాటు అటవీ మార్గంలో రాకపోకలకు అనుమతి లభించింది.
పులుల గణనతో నెలకొన్న సందిగ్ధత
నాగార్జునసాగర్ - శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టమైన పురాణ నేపథ్యం ఉంది. అశ్వత్థామ మహర్షి స్వయంగా ప్రతిష్టించిన స్వయంభూ శివలింగంగా భక్తులు దీనిని కొలుస్తారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఏడాది పొడవునా ఈ ప్రాంతంలోకి ప్రవేశం నిషిద్ధం కాగా, కేవలం శివరాత్రి పర్వదినాల్లో మాత్రమే అటవీ శాఖ కట్టుదిట్టమైన షరతులతో అనుమతి ఇస్తుంది. అయితే ఈ ఏడాది అభయారణ్యంలో పులుల గణన ప్రక్రియ జరుగుతుండటంతో అధికారులు తొలుత అనుమతులు నిరాకరించారు. ఈ పరిణామంతో వేలాది మంది భక్తులు ఆందోళనకు గురయ్యారు.
మంత్రి ఫరూక్ విజ్ఞప్తి.. పవన్ కళ్యాణ్ సానుకూల నిర్ణయం
దర్శనం నిలిచిపోయిన విషయాన్ని గమనించిన భక్తులు రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. భక్తుల మనోభావాలను గౌరవించిన మంత్రి ఫరూక్, వెంటనే ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి రాతపూర్వక విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్, అటవీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఈ నెల 14, 15 తేదీల్లో భక్తుల సందర్శనకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ పి.వి. చలపతిరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అటవీ మార్గాల ద్వారా పయనం
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, దిగువమెట్ట మరియు మార్కాపురం జిల్లా పాపినేని పల్లె వంటి నాలుగు ప్రధాన మార్గాల ద్వారా భక్తులు సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణించి క్షేత్రానికి చేరుకోవచ్చు. అటవీ నిబంధనలకు కట్టుబడి, పర్యావరణానికి హాని కలగకుండా స్వామివారిని దర్శించుకోవాలని మంత్రి ఫరూక్ విజ్ఞప్తి చేశారు. సందిగ్ధతను తొలగించి దర్శనానికి సహకరించిన పవన్ కళ్యాణ్‌కు భక్తులు మరియు స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
