Let's talk: editor@tmv.in
గుండె ఆగుతోంది.. ఎందుకంటే?

గుండె ఆగుతోంది.. ఎందుకంటే?

FL - TRND
1 అక్టోబర్, 2025

భారతదేశపు గుండె తాళాలు మెల్లగా మారుతున్నాయి.. జీవన రాగంలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి ఒక కొత్త మౌన శత్రువు దగ్గరగా చేరుతున్నాడు..! ఒకప్పుడు వృద్ధులకే అనుకున్న వ్యాధి.. ఇప్పుడు యువతని కూడా అల్లుకుంటోంది..! పల్లెల వీధుల్లోనూ, నగరాల రద్దీలోనూ అదే నిశ్శబ్ద స్వరంతో పిలుస్తోంది. ప్రతి నిమిషం 8 ప్రాణాలు మాయమవుతున్నాయి. దక్షిణాసియా గాలిలో ఆ ఆరుపులు కలుస్తున్నాయి. ఎవరూ ఊహించని వయసుల్లోనూ గుండెల ధ్వనులు ఆగిపోతున్నాయి. జీవితం అర్ధాంతరంగా ఆగిపోతోంది. ఎందుకంటే గుండె మాట వినిపించడం ఆపేస్తోంది. మారుతున్న కాలం, మారుతున్న అలవాట్లు.. మన గుండెను సవాలు చేస్తున్నాయి.

దేశంలో మూడో వంతు మరణాలు ఇప్పుడు గుండె వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ స్వయంగా చెప్పింది. ఒక దశాబ్దం క్రితం 22 శాతంగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు 33శాతానికి చేరింది. పురుషులలో ఇది 24 శాతం నుంచి 32శాతానికి దాటింది. మహిళలలో 20 నుంచి 29శాతానికి చేరింది. తూర్పు భారతంలో ఇది అత్యధికంగా పెరిగింది. 29శాతం నుంచి 34శాతానికి దాటింది. పశ్చమభారతంలో కూడా పెరుగుదల కనిపించింది. ఇటు దక్షిణం మాత్రమే కొద్దిగా తగ్గుదల చూసింది. ఇక 30 నుంచి 44 మధ్య వయసులోనూ ఇప్పుడు గుండె మాయాజాలం ప్రాణాలను తీస్తోంది. ఆ వయసులో 25శాతం మరణాలు గుండె జబ్బుల వల్లనే రికార్డవుతున్నాయి. 45 నుంచి 54 మధ్య వయసులో 35శాతం మరణాలు హార్ట్‌ ప్రాబ్లెమ్స్‌ వల్లనే నమోదవుతున్నాయి. గ్రామాల్లో 30శాతం మరణాలు గుండె కారణంగానే రికార్డవుతుంటే.. నగరాల్లో ఇది 34శాతం దాటింది. మారిన జీవనశైలి దీనికి కారణంగా వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, మద్యపానం, ఉప్పు ఎక్కువగా తినడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం, కదలకుండా ఒకే చోట కూర్చొని పనిచేయడం లాంటి చర్యలతో మన గుండెను క్రమంగా బలహీనమవుతుంది.

ఇటు కుటుంబాల గుండెల్లో ఈ వ్యాధి చెరగని గాయాన్ని మిగుల్చుతోంది. 40ఏళ్ల వయసులోనే తండ్రి హఠాత్తుగా కూలిపోతే పిల్లల భవిష్యత్తు ఏ దిశలో నడుస్తుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఐదేళ్ల పిల్లాడి చేతిలో పుస్తకం కాకుండా కన్నీటి బొట్లు పడుతాయి. యువ తల్లులు గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల ఇంటి స్తంభం కూలిపోతుంది. పెద్దవాళ్లు మాత్రమే కాకుండా మధ్య వయసువారు చనిపోయే కొద్దీ కుటుంబంలో వెలితి పెరుగుతుంది. ఒకరి గుండె ఆగిపోవడం అనేది కేవలం ఒక ప్రాణం పోవడం కాదు, ఒక కుటుంబం మొత్తం వణికిపోవడం. ఆ నిశ్శబ్ద వేదనలో గుండెల గాయాలు ఎన్నటికీ మానవు.

ఇది కేవలం వ్యక్తిగత దుఃఖం కాదు, దేశం మొత్తానికి భారం. గుండె వ్యాధుల పెరుగుదల కారణంగా పనిచేసే వయసులోనే వేలాది మంది ఉత్సాహం కోల్పోతున్నారు. ఆఫీసుల ఉత్సాహం తగ్గిపోతోంది, గ్రామాల్లో పని చేతులు క్షీణిస్తున్నాయి. ఆసుపత్రులు నిండిపోతున్నాయి.. మందుల ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక కుటుంబం కష్టపడి సంపాదించిన పొదుపు, ఒక్కసారిగా చికిత్స ఖర్చులలో కరిగిపోతోంది. ఇది ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఆర్థిక భారం కూడా. అందుకే గుండె బలహీనమైతే, దేశం బలహీనమవుతుంది.

అయితే గుండెను రక్షించుకోవడం మన చేతిలోనే ఉంది. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూసుకుంటూ నడక ప్రారంభిస్తే గుండె ఉల్లాసంగా ఉంటుంది. ఉప్పు తక్కువగా తినడం, కొవ్వు తగ్గించడం, పొగ తాగడాన్ని వదిలేయడం, మద్యం మానేయడం లాంటివి మన గుండెకు వరాలు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చు. చిన్న చిన్న మార్పులు పెద్ద ప్రాణాలను రక్షించగలవు. గుండెను రక్షించడం అంటే కేవలం మన ప్రాణాన్ని కాదు, అనేక కుటుంబాల భవిష్యత్తును కూడా కాపాడటమే.

గుండె ఆగుతోంది.. ఎందుకంటే? - Tholi Paluku