
గుంటూరు వేదికగా ప్రారంభమైన మూడోవ ప్రపంచ తెలుగు మహాసభలు
ఆంధ్రా సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు పట్టణ శివారులోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు భాషా, సంస్కృతుల మహోత్సవంగా నిలిచే ఈ మహాసభలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య శ్రీనివాస కళ్యాణ మహోత్సవంతో శుభారంభం చేశారు.
ఈ కార్యక్రమాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘురాం, విశ్వయోగి విశ్వంజీ, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌తో పాటు సాహిత్య, న్యాయ, సాంస్కృతిక రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రపంచ తెలుగు మహాసభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే వేదికగా ఈ మహాసభలు నిలుస్తాయని అభిప్రాయం పడ్డారు.
జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఈ మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు భాషాభివృద్ధి, సాహిత్యం, కళలు, సంస్కృతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో తెలుగు భవిష్యత్తు వంటి అంశాలపై సదస్సులు, చర్చా వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖుల ప్రసంగాలు, సాహిత్య సమావేశాలు, నృత్య–సంగీత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
జనవరి 4న మారిషస్ అధ్యక్షుడు ధర్మ్ గోకుల్, సోమవారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరై మహాసభకు ప్రత్యేక వైభవం చేర్పనున్నారు.
మహాసభలో మొత్తం 80 పూర్ణకుంభ పురస్కారాలు, 40 విశిష్ట పురస్కారాలు, జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సుమారు వెయ్యిమంది కవులు సహస్ర కవితా నీరాజనం నిర్వహిస్తారు. మూడు రోజులపాటు సుమారు 25,000 మంది ఈ మహాసభల్లో పాల్గొని తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించనున్నారు.
