Let's talk: editor@tmv.in
గుంటూరు జిల్లా ఖాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి రాంప్రసాద్ ఆకస్మిక తనిఖీ

గుంటూరు జిల్లా ఖాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి రాంప్రసాద్ ఆకస్మిక తనిఖీ

Panthagani Anusha
10 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ రంగంలోకి దిగింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న వాహనాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. బుధవారం గుంటూరు సమీపంలోని ఖాజా టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా తనిఖీల్లో పాల్గొని ప్రైవేటు ఆపరేటర్లకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతుండటం ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం తెల్లవారుజామునే గుంటూరు జిల్లా ఖాజా టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న మంత్రి బృందం అటుగా వస్తున్న 20కి పైగా ప్రైవేటు బస్సులను ఆపి తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని ఒక బస్సును అధికారులు స్వాధీనం చేసుకోగా వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన మరో 15 బస్సులకు జరిమానాలు విధించారు.

లోపాలు అనేకం.. చర్యలు కఠినం

ఈ తనిఖీల్లో ప్రధానంగా వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, డ్రైవర్ల లైసెన్సులు వేగ నియంత్రణ పరికరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర ద్వారాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అన్న కోణంలో తనిఖీలు సాగాయి. కొన్ని బస్సుల్లో సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించిన మంత్రి వాటిని తక్షణమే సరిదిద్దాలని లేనిపక్షంలో పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

ప్రయాణికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం

ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే మా ప్రభుత్వ ధ్యేయం. యాజమాన్యాలు కేవలం లాభాపేక్షతో కాకుండా ప్రయాణికుల ప్రాణాలకు బాధ్యత వహించాలి అని స్పష్టం చేశారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా నిబంధనలు పాటించని వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన పేర్కొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన మార్గాల్లో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని రవాణా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు సాంకేతికతను కూడా జోడిస్తామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.