Let's talk: editor@tmv.in
గుంటూరు ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్ జగన్

గుంటూరు ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్ జగన్

Gaddamidi Naveen
19 జులై, 2026

గుంటూరు నగరంలో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచిందని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, బాధిత మహిళకు న్యాయం చేయడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ అరాచకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేశారు.

బుధవారం ఈ ఘటన జరిగినప్పటికీ, మూడు రోజుల పాటు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని జగన్ పేర్కొన్నారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన తర్వాత మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చూపించడం మరింత విచారకరమని అన్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత హడావుడిగా చర్యలు చేపట్టడం కంటే, బాధితురాలు తొలిసారిగా ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా మారేదే కాదని వ్యాఖ్యానించారు.

బాధిత మహిళ ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని, ఆమెకు రక్షణ కల్పించి ఉంటే ఈ ఘటనను నివారించవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు. బాధితురాలి ఫిర్యాదును పట్టించుకోకుండా మౌనం వహించడం పోలీసుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల భద్రత కోసం ఉన్న పోలీస్ స్టేషన్లు బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా, లేక అధికార పార్టీ నేతల సూచనల మేరకు వ్యవహరించడానికా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'రెడ్‌బుక్ రాజ్యాంగం' వల్లే రాష్ట్రంలో ఇటువంటి దురాగతాలు పెరిగిపోయాయని వైఎస్ జగన్ విమర్శించారు.

ఆడవాళ్లకు రక్షణ లేని దుస్థితి

ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాడులను ప్రోత్సహిస్తూ పోలీసు వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా మార్చుకుందని జగన్ ఆరోపించారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చి రాష్ట్రాన్ని 'జంగిల్‌రాజ్'గా దిగజార్చారని విమర్శించారు. తాము ఏం చేసినా కాపాడటానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం వార్డు స్థాయి టీడీపీ నాయకుల్లో పెరిగిపోవడం వల్లే వారు దుశ్శాసనుల్లా మారి మహిళలపై దాడులకు తెగబడుతున్నారని, చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు.. ఇదేనా మీ సుపరిపాలన? అని ప్రశ్నిస్తూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

ట్యాగ్‌లు
GunturIncidentJusticeForWomenWomenSafetyAndhraPradeshYSJaganYSRCPLawAndOrderAPPoliticsWomenProtectionSocialJusticeCrimeAgainstWomen
గుంటూరు ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్ జగన్ - Tholi Paluku