
గుంటూరు ఆర్.అగ్రహారంలో ఉచిత ఈఎన్టీ శిబిరం: ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
సమాజంలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ మెరుగైన వైద్యం, విద్య అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం గుంటూరులోని ఆర్. అగ్రహారం బాలాజీ హాస్పిటల్‌లో 'పీ4' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత ఈఎన్టీ మెడికల్ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'పీ4' పథకం పేద కుటుంబాల తలరాతను మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో వెనుకబడిన వారిని 'బంగారు కుటుంబాలు'గా గుర్తించి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అండగా నిలవడమే ఈ పథకం ఉద్దేశమని వివరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే 19 వేల కుటుంబాలను గుర్తించామని, అందులో 11 వేల కుటుంబాలకు దాతలు, మార్గదర్శకుల ద్వారా సహాయం అందిస్తున్నామని ఆమె తెలిపారు.
ఇక స్థానిక 58, 59, 60 సచివాలయాల పరిధిలోని ప్రజల కోసం శ్రీ బాలాజీ క్లినిక్స్ మానవతా స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించడం హర్షణీయమన్నారు. సాధారణంగా బయట వేల రూపాయలు ఖర్చయ్యే ఎండోస్కోపీ వంటి పరీక్షలను ఇక్కడ ఉచితంగా చేయడం గొప్ప విషయమని కొనియాడారు. కేవలం పరీక్షలే కాకుండా పేదవారికి అవసరమైన వైద్య పరికరాలను కూడా ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
