Let's talk: editor@tmv.in
గుంటూరులో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన మాతా–శిశు కేంద్రం ప్రారంభం

గుంటూరులో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన మాతా–శిశు కేంద్రం ప్రారంభం

Panthagani Anusha
31 జనవరి, 2026

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH)లో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఇంకా మానవత్వం మిగిలి ఉందనడానికి గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల కృషియే నిదర్శనమని పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితమే విదేశాలకు వెళ్లినా, తాము చదువుకున్న విద్యాసంస్థను పుట్టిన గడ్డను మర్చిపోకుండా వందల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి ఇంతటి భారీ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. అమెరికా వంటి దేశాల్లో పిల్లలు 18 ఏళ్లకే స్వతంత్రంగా జీవిస్తారని కానీ మన సంస్కృతిలో తల్లిదండ్రులు జీవితాంతం పిల్లలకు మార్గదర్శకులుగా ఉంటారని అదేవిదంగా మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలని కోరుకోవడం మన గొప్పతనమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములవుతున్న దాతలను సీఎం ప్రస్తావించారు. గుంటూరులో మిలీనియం బ్లాక్ కోసం 16 కోట్లు, విశాఖపట్నంలో 60 కోట్లు, కాకినాడ, కర్నూలు ఆసుపత్రులకు కోట్లాది రూపాయల నిధులను స్వచ్ఛందంగా సమకూరుస్తున్నారని తెలిపారు. గతంలో తాను పిలుపునిచ్చిన 'జన్మభూమి' కార్యక్రమం ద్వారా ఎందరో ప్రవాసులు స్ఫూర్తి పొందారని ఇప్పుడు 'పీ4' విధానం ద్వారా ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం అభివృద్ధిలో కీలకమని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశామని ఇప్పుడు ఏఐ కాలం నడుస్తోందని అమరావతిని 'క్వాంటమ్ వ్యాలీ'గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఇక వైద్య రంగంలో రాబోయే విప్లవాత్మక మార్పుల గురించి వివరిస్తూ 2026 నాటికి రాష్ట్రంలో 'డ్రోన్ అంబులెన్స్' సేవలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం కోసం 'సంజీవని' ప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని దీని ద్వారా రోగుల డిజిటల్ హెల్త్ రికార్డులను నిర్వహిస్తూ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కంటే గదుల అద్దెలే భారమవుతున్న తరుణంలో ప్రభుత్వ రంగంలోనే కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు, విజయవాడ, మంగళగిరి నగరాలు రాబోయే రోజుల్లో కలిసిపోయి అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తాయని కాలుష్య రహిత ఇంధనంపై దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇక నూతనంగా ప్రారంభించిన ఈ 5 అంతస్తుల భవనం 2.69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 600 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ఇందులో ప్రసూతి విభాగం కోసం 300 పడకలు, పీడియాట్రిక్స్ కోసం 200 పడకలతో పాటు అత్యాధునిక నియోనేటల్ ఐసీయూ,పీడియాట్రిక్ ఐసీయూ వంటి విభాగాలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ గవిని ఉమాదేవి (22 కోట్లు), నళిని-వెంకట్ తేళ్ల (8 కోట్లు) వంటి పలువురు దాతలు ఇచ్చిన భారీ విరాళాలకు తోడు ప్రభుత్వం ఫర్నిచర్, ఎక్విప్మెంట్ కోసం 27 కోట్ల రూపాయలను కేటాయించింది. డబ్బు కంటే సమాజానికి ఇచ్చే సేవలోనే అసలైన సంతృప్తి ఉంటుంని ప్రతి ఒక్కరూ పేదల సంక్షేమం కోసం తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఈసందర్బంగా పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో అభివృద్ధి, సంక్షేమం, పర్యాటక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కుప్పం పర్యటన సందర్భంగా పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి సమక్షంలో ఏడు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. వీటి ద్వారా రూ.675 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తూ గుడిపల్లిలో రూ.3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిదంగా రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లెర్నర్స్ అకాడమీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విద్యా సంస్థలతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇక పర్యాటకాభివృద్ధిలో భాగంగా ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు స్వర్ణ నవదిశ కో–వర్కింగ్ స్పేస్, ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. కంగుండి హెరిటేజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్క్‌ను ప్రజలకు అంకితం చేసి ‘డిస్కవర్ కుప్పం’ పర్యాటక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు. అదనంగా రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పున్నమి రిసార్ట్‌ను ప్రారంభించనున్నారు.