
గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత…అంబటి రాంబాబుపై కూటమి నాయకుల దాడి
గుంటూరు శివారు ప్రాంతమైన గోరంట్లలో శనివారం ఉదయం రాజకీయ సెగలు ఒక్కసారిగా చెలరేగాయి. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై వైకాపా, తెదేపా నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారితీసింది. వైకాపా చేపట్టిన ‘పాప ప్రక్షాళన’ పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబును తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో గోరంట్ల జంక్షన్ రణరంగంగా మారింది.
వివాదానికి కేంద్రమైన 'మహాపాపం' ఫ్లెక్సీలు
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైకాపా నేతలను విమర్శిస్తూ తెదేపా నాయకులు గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 'మహాపాపం' పేరుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలని అంబటి రాంబాబు శుక్రవారమే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నేరుగా ఫ్లెక్సీల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబటి వాహనాన్ని అడ్డుకున్నారు.
ముందస్తు వ్యూహంతోనే దాడి: అంబటి ఆరోపణ
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తెదేపా కార్యకర్తలు కర్రలు, ఇనుప రాడ్లతో తనపై దాడికి ప్రయత్నించారని అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడుతూ, అక్కడికక్కడే తీవ్ర అసహనానికి లోనైన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిందా? తెదేపా ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు బలవంతంగా అంబటిని అక్కడి నుంచి పంపించివేశారు.
ఈ ఘటనపై వైకాపా అగ్రనేతలు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడి ప్రసాదం పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నీచ రాజకీయం చేస్తున్నారు. లడ్డూపై అబద్ధాలు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టడమే కాకుండా వాటిని ప్రశ్నించిన మా పార్టీ నేతలపై దాడులకు దిగడం హేయం. శాంతియుతంగా పూజలు చేసుకుంటుంటే రాడ్లతో దాడి చేయడం అరాచక పాలనకు నిదర్శనం అని వారు మండిపడ్డారు.
అంబటిపై ఎస్పీకి ఫిర్యాదు
ముఖ్యమంత్రిపై అనుచిత పదజాలంతో విరుచుకుపడిన అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా పట్టుబట్టింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అంబటి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అంబటి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
