Let's talk: editor@tmv.in
గుంటూరులో గంజాయి సరఫరా చేస్తున్న 14 మంది అరెస్ట్

గుంటూరులో గంజాయి సరఫరా చేస్తున్న 14 మంది అరెస్ట్

Panthagani Anusha
6 జనవరి, 2026

జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా పోలీసులు గంజాయి సరఫరా వినియోగంలో పాలుపంచుకున్న 14 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు గంజాయి సరఫరాదారులు కాగా మిగిలిన పది మందిని వినియోగదారులుగా పోలీసులు గుర్తించారు.

నిందితులు అరకు ప్రాంతం నుంచి రహదారి మార్గంలో గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు తరలించి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు చేపట్టిన దాడుల్లో నిందితుల వద్ద నుంచి సుమారు 4 కిలోల 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. అదేవిదంగా నిందితులలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అంతేకాక గత మూడు నెలల వ్యవధిలో జిల్లాలో 40 గంజాయి కేసులు నమోదయ్యాయని ఈ కేసులకు సంబంధించి సుమారు 200 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. దాడులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ యువతను మాదకద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతాయని గంజాయి సరఫరా, వినియోగంలో పాల్గొన్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా గత డిసెంబరులో పుణె పోలీసులు పింప్రి–చించ్వాడ్ నగరంలో భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఒక అద్దె ఫ్లాట్‌లో హైడ్రోపోనిక్ విధానంలో గంజాయి సాగు జరుగుతున్నట్లు గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.3.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డ్రగ్ విక్రయ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేయడం తో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చిందని అనంతరం పుణె, పింప్రి–చించ్వాడ్, ముంబై, గోవా ప్రాంతాల్లో సమన్వయ దాడులు చేపట్టినట్లు తెలిపారు.

గుంటూరులో గంజాయి సరఫరా చేస్తున్న 14 మంది అరెస్ట్ - Tholi Paluku