Let's talk: editor@tmv.in
గీతా బోధనలు యువతకు దిశానిర్దేశం చేస్తాయి: రాష్ట్రపతి

గీతా బోధనలు యువతకు దిశానిర్దేశం చేస్తాయి: రాష్ట్రపతి

Pinjari Chand
27 ఫిబ్రవరి, 2026

భగవద్గీతలోని ఆధ్యాత్మిక బోధనలు నేటి యువతకు కొత్త దిశానిర్దేశం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దగలవని ద్రౌపది ముర్ము గురువారం పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ కడ్మా ప్రాంతంలో శ్రీ జగన్నాథ్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ చారిటబుల్ సెంటర్ ట్రస్ట్‌కు శంకుస్థాపన చేసి, భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కేంద్రం ఆధ్యాత్మిక విద్యతో పాటు సామాజిక సౌహార్దానికి వేదికగా నిలుస్తుందని, ముఖ్యంగా పేద పిల్లలకు, బాలికలకు వసతి సౌకర్యంతో విద్యను అందించనుందని తెలిపారు. భగవద్గీత బోధనలు ఆత్మకు ఆహారం లాంటివి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో సమస్త జీవజాలంపై ప్రేమ, కరుణకు అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. జగన్నాథ్ సమస్త ప్రపంచానికి నాథుడని, ఆయన కృప అందరికీ సమానంగా వర్తిస్తుందని అన్నారు. జగన్నాథుడి సన్నిధిలో జాతి, మత, తేడాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, రాష్ట్రం సామాజిక సౌహార్దం, ఆదివాసీ సంప్రదాయాల పరిరక్షణలో మంచి ఉదాహరణగా నిలిచిందన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 500కుపైగా జగన్నాథ్ ఆలయాలు నిర్మించారని తెలిపారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్.కే. బేహేరా వివరాల ప్రకారం, ఈ కేంద్రం జగన్నాథ్ ఆలయం(12వ శతాబ్దపు ఆలయం) నమూనాలో 2.5 ఎకరాల విస్తీర్ణంలో, ఖార్ఖాయ్ నది సమీపంలో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతమివ్వడంతో పాటు యువతలో నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసానికి కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. తరువాత రాష్ట్రపతి బరిదిహాలోని మణిపాల్ టాటా మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించి, వారికి ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సందేశంగా కళాశాల ప్రాంగణంలో ఒక మొక్కను కూడా నాటారు.

నేడు ప్రచండ్ లో ప్రయాణం చేయనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు రాజస్థాన్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో స్వదేశీ లైట్ కాంబాట్ హెలికాప్టర్ (ఎల్సీహెచ్) ‘ప్రచండ్’లో సార్టీ(ప్రయాణం) చేయనున్నారు. రాష్ట్రపతి గురువారం సాయంత్రం జైసల్మేర్‌కు చేరుకోనున్నారు. భారత సాయుధ దళాల సర్వసర్వాధికారి అయిన రాష్ట్రపతి, శుక్రవారం ఉదయం ‘ప్రచండ్’లో ప్రయాణం చేయనున్నారు. అనంతరం ఆమె ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని రక్షణ వర్గాలు తెలిపాయి. ‘ప్రచండ్’ భారతదేశంలో స్వదేశీగా రూపకల్పన చేసి అభివృద్ధి చేసిన తొలి యుద్ధ హెలికాప్టర్. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసింది. ఎడారుల నుంచి ఎత్తైన పర్వత ప్రాంతాల వరకు వివిధ భౌగోళిక పరిస్థితుల్లో పనిచేయగలిగేలా దీన్ని రూపొందించారు. 5,000 మీటర్లకు పైగా ఎత్తులో కూడా ఇది సమర్థంగా పనిచేయగలదు. అధునాతన అవియానిక్స్, స్టెల్త్ సదుపాయాలు, రాత్రి దాడి సామర్థ్యం, ఎయిర్-టు-గ్రౌండ్, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, రాకెట్లు, 20 మిల్లీమీటర్ల గన్ వంటి శక్తివంతమైన ఆయుధాలతో ‘ప్రచండ్’ భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ 2022 అక్టోబరులో జోధ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరిగిన ఎల్‌సీహెచ్ అధికారిక ప్రవేశోత్సవ సమయంలో ‘ప్రచండ్’లో సార్టీ చేశారు.

గీతా బోధనలు యువతకు దిశానిర్దేశం చేస్తాయి: రాష్ట్రపతి - Tholi Paluku