
గిరిజన హక్కుల పరిరక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు
గిరిజన తెగల హక్కులను, వారి సంక్షేమ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతని, గిరిజనులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో గిరిజన సంక్షేమంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవో నంబర్ 3 అమలు, దానిపై సుప్రీంకోర్టు తీర్పు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు, గిరిజనుల ఆకాంక్షలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో జారీ చేసిన జీవో నంబర్ 3 ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు లభించాయని సీఎం గుర్తుచేశారు. ఈ ఉత్తర్వు దాదాపు రెండు దశాబ్దాల పాటు అమలులో ఉందని, అయితే 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీనిపై సరిగ్గా వాదనలు వినిపించడంలో విఫలమైందని ఆరోపించారు. దీనివల్ల ఏప్రిల్ 22, 2020న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం జీవో నంబర్ 3ని రద్దు చేసిందని, ఫలితంగా గిరిజనులు 20 ఏళ్లుగా అనుభవిస్తున్న ప్రయోజనాలను కోల్పోయారన్నారు. తీర్పు వచ్చాక కూడా గత ప్రభుత్వం గిరిజన ప్రయోజనాలను కాపాడేందుకు ఎటువంటి అర్ధవంతమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
న్యాయపోరాటం & గిరిజన సంఘాలతో సంప్రదింపులు
ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 3 ద్వారా గిరిజనులకు అందాల్సిన ప్రయోజనాలు కొనసాగేలా చట్టపరమైన అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును దృష్టిలో ఉంచుకుని న్యాయపరంగా నిలబడే పరిష్కారాన్ని అన్వేషిస్తున్నామని చెప్పారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలను పెంపొందించడానికి గిరిజన సంఘాలతో తక్షణమే సంప్రదింపులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రయత్నాలను గిరిజనులకు వివరించి, వారి సూచనలను కూడా స్వీకరించాలని స్పష్టం చేశారు.
సమీక్షలో తీసుకున్న కీలక నిర్ణయాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాను వీలైనంత త్వరగా 'జోన్-1' లోకి, అలాగే పోలవరం జిల్లాను 'జోన్-2' పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో బాక్సైట్ లీజుల నిర్వహణ తీరు వల్ల అంతర్జాతీయ న్యాయ వివాదం తలెత్తిందని, గిరిజనుల హక్కులు లేదా భావోద్వేగాలకు విరుద్ధంగా తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ క్రమబద్ధీకరణ చట్టం, 1959 (1/70 చట్టం) అమలుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. దీనిపై ప్రభుత్వ దృక్పథాన్ని గిరిజన సంఘాలకు స్పష్టంగా వివరించి, వారిలోని భయాలను తొలగించాలని ఆదేశించారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, గిరిజన ప్రాంతాల్లో వైద్యం, విద్య, రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా గిరిజన సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపు ద్వారానే నిజమైన వికాసం సాధ్యమవుతుందని నొక్కిచెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించిన సీఎం చంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గిరిజన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ త్వరలోనే గిరిజన సంఘాలతో అధికారిక చర్చలు ప్రారంభించనుంది.
