
గిరిజన సమాజం ఐక్యంగా నిలవాలి: సీఎం సొరెన్ పిలుపు
దేశ వ్యాప్తంగా గిరిజన సమాజం మరింతగా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని, లేకపోతే వారి అస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ హెచ్చరించారు. ‘పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది’ అనే సామెతను ఉదహరించిన ఆయన, ఐక్యతే గిరిజనుల బతుకుదెరువు సాధన అని స్పష్టం చేశారు. శుక్రవారం రాంచీలో జరిగిన గిరిజన ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించిన సొరెన్, గిరిజనులకు జనాభా లెక్కల్లో సరైన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదని, హక్కుల కోసం పోరాటం మరింతగా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
జాతీయ రాజకీయాల్లో నిలవాలి
ఝార్ఖండ్‌కు నేను ముఖ్యమంత్రిని అయినప్పటికీ, ప్రయాణంలో ముందుకు సాగేకొద్దీ సవాళ్లు పెరుగుతాయి. అందుకే గిరిజన సమస్యలు కేవలం అరుపులుగానే కాకుండా దేశ రాజకీయాల అజెండాలో నిలవాలని జేఎంఎం అధ్యక్షుడు పేర్కొన్నారు. భూమి, అస్తిత్వం, సంస్కృతిని కాపాడాలని బిర్సా ముండా, సిదో-కానూ, తిల్కా మాంఝి, ‘దిశోం గురూ’ శిబు సొరెన్ వంటి విప్లవకారుల వారసత్వాన్ని స్మరించిన సొరెన్ ఝార్ఖండ్ కేవలం రాష్ట్రం కాదు. ఇది భూమాతకు ప్రతీక. ఇక్కడి నుంచే దేశ గిరిజన సమాజానికి దారి చూపాలన్నారు. గిరిజనుల నాగరికత రాత పూర్వక ఆధారాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్న ఆయన, మేం ప్రకృతి ఆరాధకులం.మా ధర్మగ్రంథమే ప్రకృతి అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
ప్రకృతి రక్షణను ప్రపంచం ఆలస్యంగా గుర్తిస్తోంది
ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ అటవీ నాశనం, ఢిల్లీ వాయు కాలుష్యాన్ని ఉదాహరించిన ఆయన, ప్రపంచం ఇప్పుడు గిరిజనుల హెచ్చరికల్ని ఆలస్యంగా అర్థం చేసుకుంటోందని విమర్శించారు.ఝార్ఖండ్ సహజ సంపద గిరిజనులకు శాపంగా మారిందా అనే ఆత్మపరిశీలన అవసరమని సొరెన్ అభిప్రాయపడ్డారు. నీరు–అడవి–భూమితో ఉన్న గాఢమైన అనుబంధం ఉన్నప్పటికీ, గిరిజనులను రాజకీయ నిర్ణయాల్లో ఎప్పుడూ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనులకు జనగణనలో తగిన గుర్తింపు లేదు
దేశ జనాభా లెక్కల్లో గిరిజనుల ప్రాతినిధ్యం సరైన రీతిలో ప్రతిఫలించక పోతే, సమాజం జాతీయ చైతన్యంలో నుంచి అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తర–తూర్పు వంటి కొద్ది రాష్ట్రాలు తప్పితే, గిరిజన నాయకులు ముఖ్యమంత్రి స్థాయికి చేరే అవకాశం చాలా అరుదని ఆయన గుర్తు చేశారు. ఝార్ఖండ్ తర్వాతే పొరుగు రాష్ట్రాలు గిరిజన సీఎంలను ఎంపిక చేశాయని తెలిపారు.
సమూహాంగా నిలవాలి
సమ్మేళనానికి వచ్చిన ప్రతినిధులందరి వివరాలు సేకరించి భవిష్యత్తులో నిత్యం సమన్వయం జరుపుతామని తెలిపారు. ఒక్కొక్కరిగా పోరాడితే మారదు. సమూహాంగా నిలిస్తేనే మహాశక్తిగా ఎదుగుతామని సొరెన్ పిలుపునిచ్చారు. ఐక్యతే గిరిజనుల భవిష్యత్తు రక్షణకవచమని ఆయన స్పష్టం చేశారు.
