
గిరిజన యువత ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: హరీష్ రావు
గిరిజన యువత కేవలం ఉద్యోగాలు వెతుక్కునే స్థాయిలోనే ఆగిపోకుండా, పది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఐసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, 'టిక్కీ' సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గిరిజన బిడ్డలు వ్యాపార రంగానికి అవసరమైన ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలను సద్వినియోగం చేసుకునేలా టిక్కీ మార్గదర్శకంగా నిలవడం అభినందనీయమని హరీష్ రావు కొనియాడారు. లండన్‌లో 16 హోటళ్లు ఏర్పాటు చేసిన రమేష్ నాయక్, టీ-ప్రైడ్ ద్వారా కేకులు తయారుచేస్తూ పెద్ద కంపెనీలతో పోటీపడుతున్న సురేష్ నాయక్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో గిరిజనుల వికాసానికి అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.
గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం వల్ల ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. దేశంలోనే తొలిసారిగా గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను, గురుకులాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందన్నారు. 3,300 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి లంబాడీ బిడ్డలను సర్పంచ్‌లను చేశామని, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ల్యాప్స్ కాకుండా చట్టం తెచ్చామని చెప్పారు. అలాగే 6 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను భూ యజమానులుగా మార్చామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు తీవ్ర ద్రోహం చేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఎస్టీ కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ. 2,730 కోట్లు కేటాయించి, కేవలం రూ. 70 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అది కూడా ఆఫీసు కరెంట్ బిల్లులకే సరిపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల అసైన్డ్ భూములను లాక్కుంటోందని ఆరోపించారు. లగచర్లలో భూములు ఇవ్వబోమని అడిగినందుకు లంబాడీలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ జైల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ కష్టకాలంలో టిక్కీ వంటి సంస్థలు గిరిజనులకు వ్యాపార శిక్షణ ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వ పెండింగ్ సబ్సిడీలు రాబట్టడానికి ఒక ప్రెజర్ గ్రూప్‌గా పనిచేయాలని, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ గిరిజనుల పక్షాన పోరాడుతుందని హరీష్ రావు హామీ ఇచ్చారు.
