Let's talk: editor@tmv.in
గిరిజన తెగలు స్వచ్ఛమైన మనస్సుకు,సంస్కృతికి వారసులు

గిరిజన తెగలు స్వచ్ఛమైన మనస్సుకు,సంస్కృతికి వారసులు

Panthagani Anusha
18 నవంబర్, 2025

రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్‌గా సోళ్ల బొజ్జి రెడ్డి, సభ్యులుగా జీ.సునీత, కె.లక్ష్మి, కె. సాయిరాం,కె.మల్లేశ్వరరావు, వెంకటప్ప సోమవారం ఆర్ అండ్ బీ బిల్డింగ్స్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన సంస్కృతి, ఆచారాలతో కూడిన అభినందన సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన చైర్మన్‌కు, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్టీల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చారిత్రక నిర్ణయాలను మంత్రి సత్యకుమార్ ఈ సందర్భంగా సంభాషిస్తూ దేశానికి స్వాతంతంత్రం వచ్చిన తర్వాత 1999లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ కేంద్రంలో గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదేవిదంగా 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్టీ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, గిరిజనులపై జరిగే అన్యాయాలు, దోపిడీలపై చర్యలు తీసుకునే బాధ్యతను కమిషన్‌కు అప్పగించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని (నవంబర్ 15) జన జాతి గౌరవ దివస్‌గా ప్రకటించి, 11 కోట్ల మంది ఆదివాసీలకు గౌరవం కల్పించారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులు 2013-14లో రూ. 4,200 కోట్ల నుంచి 2025-26కి రూ. 14,956 కోట్లకు పెంచారని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంఖ్యను 119 నుంచి 740కి పెంచడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు.

ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ మాట్లాడుతూ ఎస్సీ/ ఎస్టీ కమిషన్లు సమన్వయంతో పనిచేస్తేనే ఆయా కులాల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి సరైన వ్యక్తికి (సోళ్ల బొజ్జి రెడ్డికి) సరైన బాధ్యతలు అప్పగించారని, ఆయన ఎస్టీల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. శాసనసభ సభ్యులు మిరియాల శిరీష కూడా నూతన చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, ఎస్టీ కమిషన్ సహకారంతో ఏజెన్సీ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేలా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సెక్రెటరీ చిన్నరాములు, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి, ఇతర అధికారులు, సిబ్బంది, గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.