
గిరిజన గ్రామాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..రూ. కోటితో అభివృద్ధి పనులు పూర్తి
గిరిజన గ్రామాల అభివృద్ధి, గిరిపుత్రుల సంక్షేమం పట్ల తనకున్న ప్రత్యేక శ్రద్ధను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా అక్కడి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, రూ. కోటి విలువైన పలు మౌలిక వసతుల పనులను పూర్తి చేయించారు. ఈ మేరకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
గతంలో బల్లగరువు పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. వెలగపాడు, కొరపర్తి తదితర గ్రామాల్లో గిరిజనులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు సరైన భవనాలు లేక చిన్నారులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానిస్తూ సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రణాళికలు రూపొందించారు.
చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనులు
చిన్నారులు, మహిళల అవసరాల కోసం రూ. 55 లక్షల వ్యయంతో మూడు అంగన్‌వాడీ భవనాలను నిర్మించారు. ఇందులో బల్లగరువు, వెలగపాడు గ్రామాల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. గిరిజనాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగం సహకారంతో కొరపర్తి గ్రామంలోని అంగన్‌వాడీ భవనానికి ప్రహరీ గోడ నిర్మించారు. ఇదే గ్రామంలోని ఎంపీపీ స్కూలు భవనాన్ని పునరుద్ధరించడంతో పాటు, తాగునీటి సౌకర్యం కోసం కొత్తగా బోరు బావి, నీటి సరఫరా పైపు లైన్లు, అంతర్గత సీసీ రోడ్లను అందుబాటులోకి తెచ్చారు.
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అతి తక్కువ కాలంలోనే కోటి రూపాయల పనులు పూర్తి కావడం పట్ల గిరిజన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
