


గిరిజన కళలకు అంతర్జాతీయ గుర్తింపు.. విద్య, ఉపాధికి సమప్రాధాన్యం
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నృత్య రీతులను పరిరక్షించడంతో పాటు విద్య, ఉపాధి రంగాల్లోనూ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్ తెలిపారు. గిరిజన కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం-2026 వేడుకల్లో భాగంగా సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో రెండో రోజు ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్, ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, కళారూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం. మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునిక విద్యను అభ్యసించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
గిరిజన కళాకారులకు ప్రత్యేక గుర్తింపు
ధింసా నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంలో గిరిజన సంక్షేమ శాఖ చేసిన కృషిని మల్లిఖార్జున నాయక్ అభినందించారు. రాష్ట్రంలోని ఇతర గిరిజన నృత్యాలు, కళారూపాలు, కళాకారులకు కూడా అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. గిరిజన పరిశోధనా సంస్థ ద్వారా రాష్ట్రంలోని గిరిజన కళాకారుల సమగ్ర వివరాలతో డేటాబేస్ రూపొందించడంతో పాటు సంప్రదాయ సంగీత వాయిద్యాలను సేకరించి భద్రపరచనున్నట్లు వెల్లడించారు.
వర్ధమాన కళాకారులు, శిక్షకులకు అవసరమైన శిక్షణ అందించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తామని తెలిపారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన సాంస్కృతిక విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. కూచిపూడి, భరతనాట్యం వంటి సంప్రదాయ కళలకు లభిస్తున్న ప్రాధాన్యతతో సమానంగా గిరిజన నృత్యాలకు కూడా గుర్తింపు, ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యతో గిరిజన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ డైరెక్టర్ డా. మందారాణి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 2024లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించిన నిధులతో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూర్ భాగస్వామ్యంతో ఆరు గిరిజన భాషల్లో ప్రైమర్లు, నిఘంటువులను ఈ-మాడ్యూల్స్ రూపంలో రూపొందిస్తున్నామని తెలిపారు. సికిల్ సెల్ వ్యాధిపై గిరిజన భాషల్లో అవగాహన మాడ్యూల్స్ రూపొందించి ఐటీడీఏలకు అందించామని పేర్కొన్నారు. టెర్రకోట, క్లే మోడలింగ్, వెదురు ఉత్పత్తులు, పూసల తయారీ వంటి రంగాల్లో ఉపాధి శిక్షణలు అందిస్తున్నామని వివరించారు.
గురుకులాల కార్యదర్శి గౌతమి మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి, కళలు వారి జీవన విధానంలో అంతర్భాగమని, వారి ఉజ్వల భవిష్యత్తుకు విద్యే అత్యంత శక్తివంతమైన ఆయుధమని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే గురుకులాల్లో ప్రవేశాలు 10 శాతం పెరిగాయని, వచ్చే ఏడాది వాటిని 25 శాతానికి పైగా పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఉన్నత చదువుల్లో శిక్షణ అందించేందుకు ఐఐటీ మద్రాస్, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు.
సంప్రదాయ నృత్యాల సందడి
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి మాట్లాడుతూ, ధింసా, కొమ్ముకోయ, సవర ఆర్ట్, చెంచాట, తప్పెటగుళ్లు, లంబాడీ తదితర గిరిజన కళారూపాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని సుమారు 27 లక్షల మంది గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీతంపేటకు చెందిన సవర కళాకారులు థాంగ్సెంగ్ నృత్యం, పార్వతీపురం ప్రాంతానికి చెందిన కళాకారులు కంది కొత్తలు పండుగ నృత్యం, శ్రీశైలం ప్రాంతానికి చెందిన చెంచు కళాకారులు చెంచాట, కేఆర్ పురం ప్రాంతానికి చెందిన కోయ కళాకారులు కొమ్ముకోయ నృత్యాలను ప్రదర్శించారు. చిత్తూరు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు కూడా వివిధ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.
పాడేరు ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు బృందాలుగా ధింసా నృత్యాన్ని ప్రదర్శించారు. చేతులు లేదా భుజాలపై చేతులు వేసుకుని వలయాకారంలో లయబద్ధంగా నృత్యం చేసే ధింసా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజన కళాకారులు, విద్యార్థుల ప్రదర్శనలతో తుమ్మలపల్లి కళాక్షేత్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో టీఏసీ సభ్యులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ట్రైబల్ రీసెర్చ్ మిషన్ అధికారులు, గిరిజన కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
