Let's talk: editor@tmv.in
గిరిజనుల సొంతింటి కల సాకారం.. కలెక్టర్ పేరుతో ‘రాజర్షిషా గూడ’

గిరిజనుల సొంతింటి కల సాకారం.. కలెక్టర్ పేరుతో ‘రాజర్షిషా గూడ’

Gaddamidi Naveen
15 ఆగస్టు, 2026

పేదరికం, సరైన నివాస సదుపాయాలు లేక ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్న మారుమూల కొలాం గిరిజన కుటుంబాలకు అండగా నిలిచి, వారికి ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపి సొంతింటి కలను నిజం చేసిన‌ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా వారి మనసులు గెలుచుకున్నారు. ఆయన కృషికి గుర్తుగా దహిగూడ గ్రామం పేరును గిరిజనులు ‘రాజర్షిషాగూడ’గా మార్చుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పిప్పల్ధారి గ్రామపంచాయతీ పరిధిలోని దహిగూడ (రాజర్షిషాగూడ)ను జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన మూడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను ఆయన స్వయంగా ప్రారంభించారు. గతంలో ఈ గ్రామానికి చెందిన 17 మంది పేద గిరిజన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో గ్రామంలో మౌలిక వసతులు, గృహ నిర్మాణ పనులు వేగం పుంజుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ గిరిజనులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పిప్పల్ధారి గ్రామపంచాయతీ పరిధిలో మరో 10 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజన కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు మేకలు, పాడి గేదెల యూనిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మహిళలకు ఉచితంగా టైలరింగ్ యంత్రాల శిక్షణ ఇప్పిస్తామని, డిగ్రీ పూర్తి చేసిన స్థానిక యువతకు ఆదిలాబాద్‌లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

గ్రామంలో ప్రధాన సమస్యలుగా ఉన్న విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్‌వర్క్, రవాణా సదుపాయాలపై కలెక్టర్ తక్షణమే స్పందించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఈఈని ఆదేశించారు. మొబైల్ నెట్‌వర్క్ సమస్య పరిష్కారానికి టవర్ నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించి కేటాయించాలని సూచించారు. ఆధార్ కార్డులు లేని గ్రామస్తులకు వెంటనే ఆధార్ నమోదు చేయించాలని ఈడీఎం, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

మారుమూల మామిడికోరి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు సీడీ పనులతో సహా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జలసిరి పథకం కింద రైతులకు ఫారం పాండ్లు మంజూరు చేయడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపుతున్న కలెక్టర్ రాజర్షిషాకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందుబాటులో ఉండటం, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.