Let's talk: editor@tmv.in
గిరిజనుల వెనుకబాటుకు అక్షరాస్యత లోపమే కారణం: సీఎం సోరెన్

గిరిజనుల వెనుకబాటుకు అక్షరాస్యత లోపమే కారణం: సీఎం సోరెన్

Pinjari Chand
3 ఫిబ్రవరి, 2026

గిరిజన సమాజం వెనుకబడటానికి ప్రధాన కారణం అక్షరాస్యత లోపమేనని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. గిరిజనులు తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా సెరెంగ్సియా ఘాటి ప్రాంతంలో 1837లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించిన పోటో హో నేతృత్వంలోని గిరిజన వీరులకు నివాళులర్పించిన అనంతరం జరిగిన సభలో సీఎం సోరెన్ మాట్లాడారు. జల్, జంగిల్, జమీన్ (నీరు, అడవులు, భూమి) రక్షణ కోసం పోరాడిన గిరిజనులు దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ బలహీనతల కారణంగా దోపిడీకి గురయ్యారని ఆయన చెప్పారు. మన వెనుకబాటుకు, బలహీనతకు అసలు కారణం అక్షరాస్యత లేకపోవడమే. అందుకే పిల్లలకు విద్య అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ఒక్క గిరిజన న్యాయమూర్తి కూడా లేరు

పేద తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. సావిత్రిబాయి ఫూలే కిశోరి సమృద్ధి యోజన, గురుజీ క్రెడిట్ కార్డు వంటి పథకాలు విద్య కొనసాగించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థుల కోసం ఉచిత నివాస కోచింగ్ కేంద్రాలు కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. మన సమాజంలో కొందరు న్యాయవాదులు ఉన్నప్పటికీ, ఒక్క గిరిజన న్యాయమూర్తి కూడా లేరు. చోటానాగ్‌పూర్, సంతాల్ పరగణా టెనెన్సీ చట్టాలను అర్థం చేసుకుని భూములను కాపాడేందుకు గిరిజన న్యాయమూర్తులు అవసరమని సీఎం అన్నారు. బిర్సా ముండా, సిద్ధూ-కాన్హూ, చంద్ భైరవ్, పోటో హో వంటి గిరిజన వీరులు బ్రిటిష్ పాలకులపై పోరాడుతూ ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. వారు ఊహించిన జార్ఖండ్‌ను నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

అస్సాం పర్యటన నిరాశకు గురి చేసింది

తన ఇటీవల అసోం పర్యటనను ప్రస్తావించిన సోరెన్, దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో గిరిజనులను వేర్వేరు రీతుల్లో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలో తేయాకు తోటల్లో పనిచేయించేందుకు జార్ఖండ్, బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకెళ్లిన గిరిజనులను అసోంలో ఓబీసీగా గుర్తిస్తుండగా, ఇతర రాష్ట్రాల్లో మాత్రం షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా గుర్తిస్తున్నారని విమర్శించారు. అసోంలో గిరిజనులు తరచూ వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు. వారి ఆహ్వానంతోనే తాను అక్కడికి వెళ్లానని, పరిస్థితులు చూసి నిరాశకు గురయ్యానని చెప్పారు. ఆ కారణంగానే తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఈశాన్య రాష్ట్రాలను సందర్శించి గిరిజనులకు మద్దతు ఇస్తుండేవారని తెలిపారు. జార్ఖండ్ గిరిజనులు వారి పోరాటానికి అండగా నిలుస్తారని, అన్ని విధాలుగా సహాయపడేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతిపక్ష బీజేపీపై విమర్శలు గుప్పించిన సీఎం, రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయినా, ఎక్కువ కాలం జార్ఖండ్ ఏర్పాటుకు వ్యతిరేకించిన పార్టీలే పాలించాయని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయిందన్నారు. ఈ సందర్భంగా సీఎం సోరెన్ రూ.398 కోట్ల వ్యయంతో 197 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభం చేశారు. అలాగే రూ.637 కోట్ల విలువైన ఆస్తులను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, 1,489 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు.