
‘గిరిజనుల ఆత్మబంధువు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన ‘గిరిజనుల ఆత్మబంధువు’ పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన కేసీఆర్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. గిరిజన సమాజం కోసం శ్రమించి, వారి అభిలాషలను, కలలను పుస్తకరూపంలో అందించిన శ్రీను నాయక్‌ను అభినందించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా గిరిజనులు ఎదురుచూస్తున్న కలలను సాకారం చేసిన నేత కేసీఆర్ అన్నారు. తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం ద్వారా గిరిజనులకు స్థానిక స్వయంపాలన హక్కులు కల్పించగా, వారి జనాభా పెరుగుదల దృష్ట్యా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం గొప్ప నిర్ణయం అని అన్నారు. అంతేకాక, పోడు భూములపై హక్కు పత్రాలు అందించి, వాటికి రైతుబందు వర్తింపచేయడం ద్వారా వేలాది గిరిజన కుటుంబాలకు భూసంబంధిత భద్రత లభించిందని కేటీఆర్ గుర్తుచేశారు. గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు, గిరి వికాస్, గిరి పోషణ, సీఎం ఎస్టీఈఐ వంటి పథకాలను ప్రవేశపెట్టి, వారి విద్యా, సామాజిక పురోగతికి ప్రభుత్వం బలమైన పునాది వేసిందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న గిరిజన ఆత్మగౌరవ భవనాలు గిరిజన గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.
గిరిజన తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన రోజు అయిన ఆగస్టు 2ను ప్రతి గిరిజన గ్రామంలో ‘గిరిజన సంబురం’గా జరుపుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.
