
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి: డిప్యూటీ సీఎం
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, అడవిని నమ్ముకొని జీవించే గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడంపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచేందుకు పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రపంచంలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా గిరిజన ప్రాంతాలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులను ఆదేశించారు. అడవిని నమ్ముకుని జీవించే గిరిజనుల శక్తిని శ్రమను సక్రమంగా ఉపయోగించుకోవాలని, వారికి నిరంతరం సహాయం అందిస్తూ నూతన కార్యక్రమాలతో వారిలో ఉత్తేజం నింపాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తుల తయారీ సేంద్రియ (ఆర్గానిక్) ఉత్పత్తుల పెంపుదల, మరియు వాటికి సరైన మార్కెటింగ్ కల్పించడంపై దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. కాఫీ తోటలతో పాటు ఏజెన్సీలో విరివిగా దొరికే ఇతర ఉత్పత్తులను మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పెంచేలా ప్రోత్సహించాలని తెలిపారు. గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ( పారిశ్రామికవేత్తలుగా) ఎదిగేలా స్ఫూర్తిని ఇవ్వాలని అన్నారు.
ఉపాధి హామీతో ఉద్యాన పంటల అనుసంధానం
ఏజెన్సీ ప్రాంతం ఉద్యాన పంటల సాగుకు అనువుగా ఉన్నందున ఈ పంటల విస్తీర్ణం పెంపుదలను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇది గిరిజనులకు ఉపాధి కల్పనకు తోడ్పడటంతో పాటు అటవీ ఉత్పత్తుల పెంపుదలకు దోహదపడుతుందని వివరించారు. ఈ అంశంపై అధికారులు మరింత లోతుగా పరిశీలన చేయాలని ఆదేశించారు.
ఎకో టూరిజం, సినిమా షూటింగ్‌ల ప్రోత్సాహం
ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఇది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యాటకం వల్ల వచ్చే లాభాలు, పర్యాటకులకు వసతి కల్పించడం ద్వారా లభించే ఆదాయం గురించి గిరిజన యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాకుండా, గిరిజనులకు ఆదాయం పెంచేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో సినిమాలు, సీరియళ్లు, ఓటీటీ కంటెంట్ షూటింగ్‌లు జరిగేలా ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇది గిరిజనులకు ఉపాధిని అందించడంతో పాటు ఆ ప్రాంతానికి ఆదాయ వనరుగా మారుతుంది.
గిరిజనుల బతుకు చిత్రాలు మారేలా, అభివృద్ధి పనులపై నిరంతర క్షుణ్ణంగా సమీక్షించి నెలవారీ నివేదికలతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని ఈ ప్రయత్నానికి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
