
గిగ్ వర్కర్లకు బిగ్ రిలీఫ్.. 10 నిమిషాల డెలివరీ విధానం రద్దు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్విక్ కామర్స్ సంస్థల '10 నిమిషాల డెలివరీ' హామీకి తెరపడింది. తక్కువ సమయంలో వస్తువులను చేరవేయాలనే ఒత్తిడి వల్ల డెలివరీ సిబ్బంది (గిగ్ వర్కర్స్) రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవియా రంగంలోకి దిగారు. బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి ప్రముఖ సంస్థలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, సిబ్బంది ప్రాణాలకు ముప్పు తెచ్చే ఇలాంటి గడువులను తొలగించాలని ఆదేశించారు. దీంతో ఆయా సంస్థలు తమ వ్యాపార ప్రకటనల నుంచి 10 నిమిషాల డెలివరీ అనే మాటను తొలగించడానికి అంగీకరించాయి.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 'బ్లింకిట్' సంస్థ ఇప్పటికే తన బ్రాండింగ్‌లో పెను మార్పులు చేసింది. గతంలో ఉన్న “10,000 ఉత్పత్తులు 10 నిమిషాల్లో” అనే ట్యాగ్‌లైన్‌ను పూర్తిగా మార్చి, ఇప్పుడు “30,000కి పైగా ఉత్పత్తులు మీ ఇంటి ముందే” అనే కొత్త నినాదాన్ని వాడుతోంది. అంటే ఇకపై డెలివరీ సమయం కంటే నాణ్యతకు, వస్తువుల లభ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మిగిలిన డెలివరీ సంస్థలు కూడా తమ యాప్‌లలోని సమయ పరిమితులను సవరించే పనిలో పడ్డాయి, దీనివల్ల డెలివరీ సిబ్బందిపై ఉండే పని ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది.
ఈ మార్పు వెనుక గిగ్ వర్కర్ల దయనీయ స్థితిపై దేశవ్యాప్తంగా జరిగిన చర్చ ప్రధాన పాత్ర పోషించింది. ఎండ, వాన, ట్రాఫిక్ వంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా కేవలం 10 నిమిషాల్లోనే వస్తువులను అందించాలన్న నిబంధన వారి జీవితాలను వేదనకు గురిచేస్తోందని ఇటీవల పార్లమెంట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గళమెత్తారు. డెలివరీ ఏజెంట్లకు సామాజిక భద్రత, న్యాయమైన వేతనం, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి కొనసాగింపుగానే ఆయన స్వయంగా ఒకరోజు (సోమవారం) డెలివరీ బాయ్‌గా మారి వారి కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు గిగ్ వర్కర్ల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన రక్షణలను కఠినతరం చేసింది. 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన ‘సోషల్ సెక్యూరిటీ కోడ్-2020’ ద్వారా వీరికి మొదటిసారిగా చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. ఈ చట్టం ప్రకారం డెలివరీ సిబ్బందికి కేవలం జీతం మాత్రమే కాకుండా.. ప్రమాద బీమా, జీవిత బీమా, ఆరోగ్య సదుపాయాలు, వృద్ధాప్యంలో పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను ప్రభుత్వం కల్పించబోతోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక 'సోషల్ సెక్యూరిటీ ఫండ్'ను, జాతీయ స్థాయి బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అంతేకాకుండా అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మంది కార్మికుల వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం 2021లోనే ప్రారంభించిన ‘ఈ-శ్రమ్’ పోర్టల్ ద్వారా డెలివరీ పార్ట్‌నర్ల డేటాను సేకరిస్తోంది. తద్వారా సంక్షేమ పథకాలు నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి క్విక్ కామర్స్ సంస్థల మధ్య సాగుతున్న పరుగు పందెం ఆగిపోవడంతో.. డెలివరీ సిబ్బందికి శారీరక శ్రమ తగ్గుతుందని, రోడ్లపై భద్రత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం వ్యాపార నియంత్రణే కాకుండా, మానవీయ కోణంలో తీసుకున్న గొప్ప నిర్ణయంగా ఆర్థిక వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా హర్షం
"సత్యమేవ జయతే.. అందరం కలిసి విజయం సాధించాం" అంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గిగ్ వర్కర్ల గెలుపును ఉద్దేశించి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. క్విక్ కామర్స్ సంస్థలు 10 నిమిషాల డెలివరీ గడువును తొలగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్ టీ-షర్ట్‌లపై '10 నిమిషాలు' అని ముద్రించి, కస్టమర్ ఫోన్‌లో టైమర్ రన్ అవ్వడం వల్ల వారిపై ప్రాణాంతకమైన ఒత్తిడి పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో పోరాడటమే కాకుండా, స్వయంగా డెలివరీ ఏజెంట్‌గా మారి వారి కష్టాలను ప్రపంచానికి చాటిన చద్దా.. ఈ మార్పుతో రోడ్లపై సిబ్బంది భద్రత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానవత్వం, గౌరవం కోసం నిలబడిన ప్రతి పౌరుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
