
గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలి.. నీట్ నిరసనకారులపై లాఠీచార్జ్‌ను ఖండించిన కవిత
స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్ సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్ వర్కర్లు, డ్రైవర్లను ఆయా సంస్థలు తీవ్రంగా మోసం చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రోజంతా కష్టపడినా వారికి ఒక్క పైసా మిగలడం లేదని, మూడేళ్లుగా ఛార్జీలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో చర్చలు జరిపి, కార్మికులకు న్యాయమైన పారితోషికం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిగ్ వర్కర్లు చేపట్టిన బ్రేక్‌డౌన్‌కు దారి తీసే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల పోరాటానికి తెలంగాణ రక్షణ సేన పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. పేద గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని హెచ్చరించారు.
నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై ఆగ్రహం
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ చేయడాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో ప్రపంచ దేశాల ముందు భారత్ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నీట్ ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతగాని కేంద్ర ప్రభుత్వం, హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై జులుం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. పేపర్ లీకేజీ వల్ల 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, మనస్తాపంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులపై విరిగిన ప్రతి లాఠీకి, చిందిన ప్రతి రక్తం బొట్టుకు దేశ ప్రజలు బీజేపీకి ఓటు రూపంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్రం న్యాయం చేయాలని, లీకేజీకి బాధ్యులైన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని ఆమె కోరారు.
