Let's talk: editor@tmv.in
‘గిగ్ కార్మికుల సంక్షేమ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
‘గిగ్ కార్మికుల సంక్షేమ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

‘గిగ్ కార్మికుల సంక్షేమ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

Gaddamidi Naveen
31 మార్చి, 2026

తెలంగాణలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి లక్షలాది మంది గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గిగ్ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం కీలకమైన బిల్లును రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. కార్మికశాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ప్రవేశపెట్టిన “తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ కార్మికుల (నమోదు, సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు–2026” పై సభలో చర్చ అనంతరం ఆమోదం లభించింది. సుమారు నాలుగు లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఈ చట్టం ద్వారా లబ్ధి చేకూరనుంది.

మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన 'భారత్ జోడో యాత్ర' సమయంలో గిగ్ వర్కర్లను కలిసి, వారి కష్టాలను స్వయంగా విన్నారని మంత్రి గుర్తు చేశారు. వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడంపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. అగ్రిగేటర్లు (కంపెనీలు), కార్మిక సంఘాలతో చర్చించి ప్రత్యేక చట్టం తేవాలని సూచించినట్లు తెలిపారు.ఆ దిశగా ప్రభుత్వం అగ్రిగేటర్లు, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఈ బిల్లును సిద్ధం చేసిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల అనంతరం బిల్లుకు రూపకల్పన చేసి, ప్రజల అభిప్రాయాల కోసం 30 రోజుల పాటు పబ్లిక్ డొమైన్‌లో ఉంచినట్టు మంత్రి వివరించారు. ఈ ప్రక్రియలో మొత్తం 65 సూచనలు వచ్చాయని, వాటిని పరిశీలించి అగ్రిగేటర్లతో మరిన్ని చర్చలు జరిపినట్టు చెప్పారు. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల గిగ్ కార్మికులు ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ బిల్లులో భాగంగా గిగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ బోర్డులో ప్రభుత్వం, అగ్రిగేటర్లు, కార్మిక ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

బిల్లులోని ప్రధాన అంశాల ప్రకారం, గిగ్ కార్మికులు తప్పనిసరిగా ప్రభుత్వంలో నమోదు చేసుకుని ప్రత్యేక గుర్తింపు కార్డు (యూనిక్ ఐడీ) పొందాలి. వారికి సాధారణ, ప్రత్యేక సామాజిక భద్రత పథకాలు వర్తింపజేయబడతాయి. అదనంగా, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. 100 మందికి పైగా గిగ్ కార్మికులు పనిచేసే ప్రతి కంపెనీ సంస్థలో అంతర్గత వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు తప్పనిసరి చేస్తారు. అలాగే గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలు విధించే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు.

సభలోబీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం సభ్యుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అలాగే తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు అందించే విధంగా బ్యాంకులతో చర్చలు జరుపుతామని చెప్పారు. అంతేకాకుండా అసంఘటిత కార్మికుల సంక్షేమంపై విస్తృత చర్చ కోసం రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. అనంతరం సభాపతి స్థానంలో ఉన్న కాంగ్రెస్ సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఈ చట్టంతో తెలంగాణ గిగ్ వర్కర్ల హక్కులను కాపాడటంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది.

గిగ్ వర్కర్లు అంటే ఎవరు?

గిగ్ వర్కర్లు అంటే ఒక సంస్థలో శాశ్వత ఉద్యోగిగా కాకుండా, స్వతంత్రంగా లేదా తాత్కాలిక ప్రాతిపదికన సేవలు అందించే కార్మికులు. వీరు ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పనిచేస్తారు. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవింగ్, ఆన్‌లైన్ సేవలు వంటి రంగాల్లో పనిచేసే వారు గిగ్ వర్కర్లుగా పరిగణించబడతారు.

స్విగ్గీ, జొమాటో, ఉబెర్, ఓలా వంటి ప్లాట్‌ఫామ్‌లకు అనుబంధంగా పనిచేసే డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, అలాగే ఫ్రీలాన్సర్లు కూడా ఈ వర్గంలోకి వస్తారు. వీరికి స్థిరమైన జీతం, ఉద్యోగ భద్రత, పీఎఫ్ లేదా ఈఎస్ఐ వంటి ప్రయోజనాలు సాధారణంగా ఉండవు. పని చేసినంత మేరకు మాత్రమే ఆదాయం పొందడం, పని గంటలు అనిశ్చితంగా ఉండటం గిగ్ వర్కర్ల ప్రత్యేకత. నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న నేపథ్యంలో ఈ వర్గం వేగంగా పెరుగుతోంది. అయితే, భద్రతా లోపాలు, ఆదాయ అస్థిరత వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు.

పారాక్వాట్ హెర్బిసైడ్‌పై నిషేధం విధించాలి: అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

మానవ ఆరోగ్యం, జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న 'పారాక్వాట్ డిక్లోరైడ్ (24శాతం) అనే గడ్డి నివారణ మందును (హెర్బిసైడ్) దేశవ్యాప్తంగా నిషేధించాలని కోరుతూ తెలంగాణ శాసనసభ సోమవారం ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, సంబంధిత చట్టాల ప్రకారం ఈ రసాయనంపై నిషేధం విధించాలని అసెంబ్లీ విజ్ఞప్తి చేసింది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ప్రజా ఆరోగ్యం, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకుని పారాక్వాట్ ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, రవాణా, నిల్వపై పూర్తిస్థాయి నిషేధం అవసరమని ఆయన పేర్కొన్నారు. మంత్రి ఈ రసాయనం వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తూ.. పారాక్వాట్ అనుకోకుండా లేదా కావాలని సేవించినా అది ఊపిరితిత్తులు ఇతర అంతర్గత అవయవాలను దెబ్బతీసి ప్రాణాంతకంగా మారుతుంది. దీనికి ఎటువంటి విరుగుడు లేకపోవడం అత్యంత ఆందోళనకరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిపై ఇప్పటికే నిషేధం లేదా కఠినమైన ఆంక్షలు విధించాయని తెలిపారు.

రైతుల ఆరోగ్యంపై ప్రభావం

సరైన రక్షణ కవచాలు లేకుండా ఈ రసాయనాన్ని వాడే రైతులు, వ్యవసాయ కార్మికులు శ్వాసకోశ వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే వ్యక్తులు క్షణికావేశంలో ఈ విషాన్ని సేవించడం వల్ల అనేక మరణాలు సంభవించినట్లు ఆయన గుర్తుచేశారు.

ఈ చర్చలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తన పరిధిలో నిషేధాన్ని అమలు చేయవచ్చని సూచించగా, ఇతర సభ్యులు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ హెర్బిసైడ్‌ను వ్యవసాయ అధికారుల అనుమతితోనే విక్రయించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, ఆన్‌లైన్‌లో ఇది సులభంగా అందుబాటులో ఉంటోందని చెప్పారు. భూసార రక్షణకు, ప్రజారోగ్యానికి దీనిని పూర్తిగా నిషేధించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడినట్లు ప్రకటించారు.