
గిగ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం పలు చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంది. విద్యా సంస్థల్లో కుల వివక్షను అరికట్టడం నుంచి, వృద్ధుల సామాజిక భద్రత, గిగ్ వర్కర్ల సంక్షేమం వరకు అనేక కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను నిర్మూలించే లక్ష్యంతో 'రోహిత్ వేముల చట్టం' తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ముసాయిదాను రూపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఈ చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది.
వృద్ధాప్య భద్రత - జీతంలో కోత
వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించే పిల్లలపై కఠిన చర్యలు తీసుకునేలా ఒక కొత్త బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను పోషించడంలో విఫలమైతే, వారి జీతం నుంచి 15 శాతం లేదా గరిష్టంగా రూ.10,000 (తక్కువగా ఉన్నది) మినహాయింపు జరుపబడుతుంది. కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు అందజేస్తారు.
విద్వేష ప్రసంగాల నియంత్రణ
సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే పోస్టులు, అల్లర్లను ప్రేరేపించే విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు, 2026' కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మత సామరస్యాన్ని కాపాడటం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
గిగ్ వర్కర్ల సంక్షేమం
రాష్ట్రంలోని సుమారు 4.2 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, డ్రైవర్లు మొదలైనవారు) ప్రయోజనం కోసం 'తెలంగాణ ప్లాట్‌ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్, 2026' ను ఆమోదించారు. వీరి కోసం ఒక సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తారు. కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసి, వారికి చట్టబద్ధమైన గుర్తింపు సామాజిక భద్రత కల్పిస్తారు.
హైదరాబాద్ మెట్రో ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో ఉన్న 69 కి.మీ మేర మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అప్పులతో కలిపి సుమారు రూ.15,000 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా.రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుల గణన నివేదికను జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ సమర్పించగా, కేబినెట్ దానిని ఆమోదించింది. దీనిని మరింత అధ్యయనం చేసేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు.రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుల గణన నివేదికను జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ సమర్పించగా, కేబినెట్ దానిని ఆమోదించింది. దీనిని మరింత అధ్యయనం చేసేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు.
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు, వారి భద్రతను నిర్ధారించేందుకు 'తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు' కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సామాజిక న్యాయం, మహిళా భద్రత అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
