
గాల్లోనే ఢిల్లీ ప్రజల ఆరోగ్యాలు
రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల ఓపిడీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గాలి కాలుష్య ప్రభావంతో శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పీ.జీ.ఐ.ఎం.ఇ.ఆర్ ప్రొఫెసర్ డాక్టర్ పులిన్ గుప్తా మాట్లాడుతూ కాలుష్యం కారణంగా బ్రాంకైటిస్, ఆస్తమా, సైనసైటిస్, ముక్కు కారడం, చర్మ వ్యాధులు, కళ్ల ఎర్రబారడం వంటి సమస్యలతో రోగులు భారీగా ఆసుపత్రులకు వస్తున్నారు. కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత కేసులు సుమారు 22–25 శాతం పెరిగాయని చెప్పారు.
‘ఈ ఏడాది గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా ఉంది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులతో బాధపడుతున్నవారికి ఇది మరింత ప్రమాదకరం. గొంతు దురద, ముక్కు కారడం, కంటిలో దురద, ఛాతి బిగుతుగా మారడం వంటి లక్షణాలతో చాలా మంది వస్తున్నారు’ అని సర్ గంగారామ్ ఆసుపత్రి ఛెస్ట్ మెడిసిన్ విభాగం వైస్ ఛైర్మన్ డాక్టర్ బాబీ భలోత్రా వివరించారు. అలాగే బయట ఆడుకోవడం, ఉదయం పూట చేసే వ్యాయామాలు మానుకోవాలి. వృద్ధులు తెల్లవారుజామున బయటికి రాకుండా సూర్యోదయం తర్వాత మాత్రమే, అది కూడా మాస్క్‌తో వెళ్లాలి. ప్రభుత్వం హైబ్రిడ్ వర్క్ పద్ధతిని ప్రోత్సహించాలి. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, ధూళి కణాలు గాలిని మరింత కలుషితం చేస్తున్నాయి అని హెచ్చరించారు.
క్షీణించిన గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. గురువారం ఉదయం 8 గంటలకు గాలి నాణ్యత సూచీ (ఎక్యూఐ) 271గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు ఇది 202గా ఉండగా, కేవలం కొన్ని గంటల్లోనే గణనీయంగా పెరిగింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) తాజా గణాంకాల ప్రకారం గురువారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఎక్యూఐ) 271గా నమోదైంది. బురారీ క్రాసింగ్‌లో 280, ద్వారక సెక్టార్ 8లో 296, ఐటీఓ వద్ద 295గా ఉంది. నరేలా, బవానా ప్రాంతాల్లో అయితే ‘వెరీ పూర్’ కేటగిరీకి చేరి 300 దాటింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు ‘పూర్’ కేటగిరీలోనే కొనసాగుతున్నాయి. సీపీసీబీ వివరాల ప్రకారం బురారీ క్రాసింగ్‌లో 280, ద్వారక సెక్టార్–8లో 296, ఐటీఓ వద్ద 295 ఏక్యుఐ నమోదైంది. సీఆర్‌ఆర్‌ఐ మథురా రోడ్ (268), జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (258), ఓఖ్లా ఫేజ్–2 (255), రోహిణి (296) ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇక నరేలా (302), బవానా (337) ప్రాంతాలు ‘వెరీ పూర్’ కేటగిరీలోకి జారిపోయాయి. అయితే దిల్షాద్ గార్డెన్ ప్రాంతం మాత్రం 183 ఏక్యుఐతో ‘మోడరేట్’ విభాగంలో ఉంది.
సీపీసీబీ వర్గాల ప్రకారం
0–50 ‘గుడ్’, 51–100 ‘సాటిస్‌ఫ్యాక్టరీ’, 101–200 ‘మోడరేట్’, 201–300 ‘పూర్’, 301–400 ‘వెరీ పూర్’, 401–500 ‘సీవియర్’గా పరిగణిస్తారు. ఇక రాజధాని మీద ఉదయాన్నే స్మాగ్ పొర కమ్ముకుంది. కర్తవ్య పథ్, ఐటీఓ, ఢౌలా కువాన్ ప్రాంతాల్లో గాలిలో పొగమంచు తేలుతూ కనిపించింది.
దీపావళి తర్వాత ఢిల్లీ సర్కార్ కూడా గాలి నాణ్యతను పెంచడానికి ప్రయత్నం చేసింది. కానీ గాలి కాలుష్యం మరింతగా పెరిగింది.
