
గాయత్రి జలపాతం - సందర్శకుల కనులకు మరపురాని ప్రకృతి సోయగం...
తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోని అరణ్య గర్భంలో దాగి ఉన్న గాయత్రి జలపాతం, ప్రకృతి ప్రేమికులకు మాత్రమే కాకుండా సాహస క్రీడల అభిమానులకు కూడా ఒక ప్రత్యేక గమ్యస్థానంగా మారుతోంది. స్థానికంగా “గాడిద గుండం” లేదా “ముక్తి గుండం” అని పిలవబడే ఈ జలపాతం, తన సహజ సౌందర్యంతో పాటు అడ్వెంచర్ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందుతోంది.
కడెం నదిపై ఏర్పడిన ఈ జలపాతం సుమారు 363 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ జలపాతం తెలంగాణలోనే అతి ఎత్తైనా జలపాతం. ఎత్తునుండి జాలువారే జలదారాల చప్పుడు సంగీతాన్ని మరిపించే విధంగా ఉంటుంది. జలపాత నీటి బిందువులు శీతాకాలంలో హిమచల్‌ప్రదేశ్,జమ్ముకాశ్మీర్‌లో పడే మంచుబిందువులను తలపిస్తుంటాయి.
కొండలపై నుండి పాలాధారలా పడుతూ, చుట్టూ ఉన్న పచ్చని అరణ్య ప్రాంతంతో కలసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. ప్రకృతి మధ్యలో ఒంటరిగా నిలిచిన ఈ జలపాతం వద్దకు చేరుకోవడానికి కొంత ట్రెక్కింగ్ అవసరం కావడం వల్ల, ఇది సాధారణ పర్యాటక ప్రదేశాల కంటే భిన్నంగా ఉంటుంది.
ప్రకృతి అందాలు - ప్రశాంతతకు చిరునామా
గాయత్రి జలపాతం చుట్టూ విస్తరించిన అడవులు, కొండలు, సహజ నిశ్శబ్దం అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. నగర జీవనంలోని హడావిడిని మరిచి, ప్రకృతితో మమేకం కావాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం. పక్షుల కిలకిలా రావాలు, నీటి జలపాత శబ్దం, చల్లని గాలి కలిసి ఒక సహజ సంగీతాన్ని సృష్టిస్తాయి.
వర్షాకాలంలో ఈ జలపాతం మరింత వైభవంగా కనిపిస్తుంది. నీటి ప్రవాహం పెరిగి, జలపాతం మరింత అద్భుతంగా మారుతుంది. సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు సందర్శించడం అత్యంత అనుకూలం.
అడ్వెంచర్ క్రీడల కేంద్రంగా గాయత్రి జలపాతం
గాయత్రి జలపాతం కేవలం ప్రకృతి అందాలకే కాకుండా, అడ్వెంచర్ క్రీడలకు కూడా ఒక ప్రధాన వేదికగా మారింది. తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వాటర్ రాపెల్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. 2011 సంవత్సరం నుండి ఈ పోటీలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.
గతంలో ఈ పోటీలను కుంటాల జలపాతం వద్ద నిర్వహించేవారు. అక్కడ రాఫ్టింగ్, బెలూనింగ్, క్యాపింగ్ టెంట్స్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. అయితే కుంటాల జలపాతం ఎత్తు సుమారు 135 అడుగులు మాత్రమే ఉండటంతో, మరింత ఎత్తైన ప్రదేశాల కోసం సాహసికులు పరిశీలించడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో గాయత్రి జలపాతం పై వారి దృష్టి పడింది. ఇది ఎత్తైన, సాహసక్రీడలకు అనుకూలమైన ప్రదేశం కావడంతో, ఇక్కడ ప్రీ-వరల్డ్ కప్ వాటర్ రాపెల్లింగ్ పోటీలను నిర్వహించడం ప్రారంభించారు.
ఈ పోటీలలో మొత్తం 12 విభాగాలలో సాహస కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వాటిలో ముఖ్యంగా, తాళ్ల సాయంతో జలపాతం పైకి ఎక్కడం, అదే విధంగా అపసవ్య దిశలో దిగడం (రాపెల్లింగ్), కళ్లకు గంతలు కట్టుకుని తాళ్ల సహాయంతో ఎక్కడం, వివిధ సాహస పద్ధతుల్లో పోటీలు నిర్వహించడం ఉంటాయి. ఈ పోటీలు పాల్గొనేవారిలో ధైర్యం, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పరీక్షిస్తాయి.
అప్పట్లో ఈ పోటీలలో దాదాపు 300 మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఔత్సాహికులు పాల్గొన్నారు. వయస్సు ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించారు. 12 నుండి 16 సంవత్సరాల వరకు జూనియర్ బాలబాలికలు, 17 నుండి 50 సంవత్సరాల వరకు సీనియర్ పురుషులు, మహిళలు, 50 సంవత్సరాల పైబడిన వారితో వెటరన్ బృందాలుగా ఏర్పాటు చేస్తారు. ప్రతి బృందంలో 12 మంది సభ్యులు ఉండగా, మొత్తం 25 బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
గాయత్రి జలపాతం ఇప్పుడు కేవలం ఒక ప్రకృతి అందాల ప్రదేశం మాత్రమే కాదు, సాహస క్రీడల కేంద్రంగా కూడా ఎదుగుతోంది. ఒకవైపు ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతతను అందిస్తుండగా, మరోవైపు అడ్వెంచర్ ప్రియులకు సవాళ్లను విసురుతోంది.
అదిలాబాద్ జిల్లాలోని ఈ అద్భుత ప్రదేశం, ప్రకృతి, సాహసం కలిసిన అరుదైన గమ్యస్థానంగా నిలుస్తోంది. ఒకసారి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే, అది మీకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది.
చేరుకునే మార్గం
హైదరాబాద్ నుండి సుమారు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి చేరుకోవడానికి ముందుగా నేషనల్ హైవే 44 ద్వారా నెరడిగొండ చేరుకోవాలి. అక్కడి నుండి కుప్తి గ్రామం, తరువాత తార్నం ఖుర్ద్ వరకు మట్టి రహదారిలో ప్రయాణించాలి. అక్కడి నుండి సుమారు 5 కిలోమీటర్ల అడవి మార్గంలో నడక చేయాలి. ఈ ప్రయాణం కొంత కష్టతరమైనదైనా, మార్గమధ్యలో కనిపించే ప్రకృతి అందాలు ప్రతి అడుగును ఆనందదాయకంగా మారుస్తాయి.
సమీప పర్యాటక ప్రదేశాలు
గాయత్రి జలపాతం సమీపంలో కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. కుంటాల జలపాతం అదిలాబాద్ జిల్లాలో అత్యంత ఎత్తైన జలపాతం కాగా, పొచ్చెర జలపాతం కూడా తన ప్రత్యేక ఆకర్షణతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
వసతి సదుపాయాలు
ఈ జలపాతం సమీపంలో హోటళ్లు లేదా రిసార్ట్లు లేవు. అందువల్ల నెరడిగొండ, నిర్మల్, అదిలాబాద్ పట్టణాల్లో వసతి ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడి నుండి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని జలపాతాన్ని సందర్శించడం ఉత్తమం.
