
‘గాడ్‌మ్యాన్’ ఖరాత్ ఆలయానికి రూ. కోటి నిధులు
అత్యాచార ఆరోపణలతో అరెస్టైన స్వయం ప్రకటిత గాడ్‌మ్యాన్ అశోక్ ఖరాత్‌కు చెందిన ఆలయానికి 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటికి పైగా నిధులు మంజూరు చేసినట్లు అధికారిక పత్రాలు వెల్లడించాయి. నాసిక్ జిల్లా సిన్నర్‌లోని శ్రీ ఇశాన్యేశ్వర్ దేవస్థాన్ ట్రస్ట్‌కు ఖరాత్ అధిపతిగా వ్యవహరించాడు. ఈ ఆలయం అభివృద్ధి పనుల కోసం 2018 మార్చి 31న ప్రాంతీయ పర్యాటక అభివృద్ధి పథకం కింద పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రూ.1.05 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. అప్పట్లో ఈ శాఖకు బీజేపీ నాయకుడు జయకుమార్ రావల్ మంత్రి గా ఉన్నారు. ఈ నిధులతో హాల్ నిర్మాణం, ప్రాంగణంలో పేవింగ్ బ్లాక్స్, మహిళలు–పురుషులకు వేర్వేరు మరుగుదొడ్లు, డ్రెస్సింగ్ రూములు, పార్కింగ్ సౌకర్యం, భక్తులకు వసతి గదులు, ఉద్యానవనం, విద్యుతీకరణ వంటి పనులు చేపట్టారు. మొత్తం నిధుల్లో రూ.25 లక్షలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా 58 ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.112 కోట్ల నిధుల మంజూరులో భాగంగా జరిగింది. అందులో సుమారు రూ.17 కోట్లు వివిధ అమలు సంస్థలకు విడుదల చేశారు. ఈ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) ద్వారా అమలు చేశారు. అధికారుల ప్రకారం, నిధుల మంజూరు సమయంలో ఖరాత్‌పై ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపారు. నాసిక్ జిల్లాలో ఎంపికైన నాలుగు ప్రాజెక్టుల్లో ఈ ఆలయానికే అత్యధిక నిధులు కేటాయించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, 35 ఏళ్ల మహిళపై మూడు సంవత్సరాల పాటు అత్యాచారం చేసిన ఆరోపణలతో ఖరాత్‌ను మార్చి 18న పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఐపీఎస్ అధికారి తేజస్వి సత్పుటే నేతృత్వంలో సాగుతున్న విచారణలో ఇప్పటివరకు ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో గర్భిణి మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో ఖరాత్‌కు సంబంధించిన సుమారు 100 అభ్యంతరకర వీడియోలు, రూ.1,500 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక అక్రమాలు, ఆస్తులపై విచారణ చేపడుతుండగా, సైబర్ పోలీసులు వీడియోలపై పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును మహారాష్ట్ర డీజీపీ సదానంద్ దాతే పర్యవేక్షిస్తున్నారు.
బాధితుల వీడియోలు వైరల్ చేసిన ఇద్దరు అరెస్ట్
ఇక ఖరాత్ కేసులో బాధిత మహిళల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇద్దరిని మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోలను షేర్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, మీడియా, సోషల్ మీడియా వినియోగదారులు బాధితుల వీడియోలను పంచకూడదని సిట్ విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
