Let's talk: editor@tmv.in
గాజువాకలో దారుణం: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా నరికి

గాజువాకలో దారుణం: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా నరికి

Panthagani Anusha
31 మార్చి, 2026

విశాఖ నగర శివార్లలోని గాజువాకలో సభ్య సమాజం తలవంచుకునేలా ఒక అత్యంత కిరాతకమైన హత్యా ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఒక వ్యక్తి తన ప్రియురాలిని అతి దారుణంగా హతమార్చి ఆమె దేహాన్ని ముక్కలుగా కోసి దాచిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన దిగ్భ్రాంతికర అంశాలు ఇలా ఉన్నాయి.

డేటింగ్ యాప్ పరిచయం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనికా పొలిపల్లి (28), విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగాలో విధులు నిర్వహిస్తున్న నేవీ సిబ్బంది చింతాడ రవీంద్రకు 2021లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచుగా కలుసుకునేవారు. అయితే, ఈ క్రమంలో రవీంద్ర వద్ద నుంచి మౌనిక సుమారు రూ. 3.5 లక్షల వరకు నగదు తీసుకున్నట్లు సమాచారం.

బెదిరింపులే కారణమా?

పోలీసుల ప్రాథమిక విచారణలో రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మౌనిక తన వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోగా వారి సంబంధం గురించి రవీంద్ర భార్యకు చెప్తానని తరచుగా బెదిరించేది. దీంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఈ బెదిరింపుల నుంచి ఎలాగైనా బయటపడాలని భావించిన రవీంద్ర, ఆమెను అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు.

ముక్కలుగా నరికి.. ఫ్రిజ్‌లో దాచి..

పథకం ప్రకారం ఆదివారం రవీంద్ర తన నివాసానికి మౌనికను పిలిపించాడు. అక్కడ ఇద్దరి మధ్య మళ్ళీ వాగ్వాదం జరగడంతో ఆవేశానికి లోనైన రవీంద్ర ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చడానికి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాలను తన ఇంట్లోని ఫ్రిజ్‌లో భద్రపరిచిన నిందితుడు ఆమె గుర్తింపు దొరకకుండా ఉండేందుకు తల చేతులను సమీపంలోని ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేశాడు.

స్థానికుల నుంచి అందిన సమాచారం అనుమానాస్పద కదలికల ఆధారంగా పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోరం బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ పోలీసులు నిందితుడి ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దహనం చేసిన ప్రాంతంలో లభించిన ఆధారాలను కూడా సేకరించారు. నిందితుడు రవీంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర హత్యోదంతం పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో పెను సంచలనంగా మారింది.