
గాజా పునర్నిర్మాణానికి రూ.63,672 కోట్లు
యుద్ధంతో ఛిన్నాభిన్నమైన గాజాకు పూర్వవైభవాన్ని చేకూర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన 'బోర్డ్ ఆఫ్ పీస్' ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని 'డొనాల్డ్ జే ట్రంప్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్' వేదికగా గురువారం జరిగిన ఈ చారిత్రాత్మక తొలి భేటీలో గాజా సహాయ ప్యాకేజీ కోసం తొమ్మిది దేశాలు కలిసి 7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.63,672 కోట్లు) భారీ నిధులను ప్రకటించాయి. అమెరికా తన వంతుగా మరో 10 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచారు.
భద్రత కోసం అంతర్జాతీయ దళాలు
గాజాలో శాంతిని నెలకొల్పడంతో పాటు హమాస్‌ను నిరాయుధులను చేసేందుకు ఒక పటిష్టమైన 'అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని' ఏర్పాటు చేయాలని బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం ఇండోనేషియా, మొరాకో, కజకిస్థాన్, కొసావో, అల్బేనియా దేశాలు తమ సైనిక బలగాలను పంపేందుకు అంగీకరించగా, స్థానిక పోలీసులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఈజిప్ట్, జోర్డాన్ దేశాలు తీసుకున్నాయి. మొత్తం 20,000 మంది సైనికులు, 12,000 మంది పోలీసులతో కూడిన ఈ భారీ భద్రతా వలయం గాజాలో శాంతిని కాపాడనుంది.
రఫా నుంచే పునర్నిర్మాణ పనులు
పునర్నిర్మాణ ప్రక్రియను తొలుత గాజాలోని అత్యంత కీలకమైన 'రఫా' ప్రాంతం నుంచి ప్రారంభించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేసిన తర్వాతే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తారు. శాంతి స్థాపన జరిగితేనే గాజాకు సుస్థిర భవిష్యత్తు ఉంటుందని, అందుకే మొదటి దశలో రఫాపై దృష్టి సారించినట్లు అంతర్జాతీయ దళాల అధిపతి మేజర్ జనరల్ జాస్పర్ జెఫర్స్ స్పష్టం చేశారు.
భారత్ అప్రమత్తం.. పరిశీలక హోదాలోనే హాజరు
ఈ కీలక భేటీకి భారత్ కూడా హాజరైంది. అయితే ఈ మండలిలో అధికారిక సభ్య దేశంగా కాకుండా, కేవలం 'పరిశీలక' హోదాలోనే భారత్ పాల్గొనడం గమనార్హం. భారత రాయబార కార్యాలయ ప్రతినిధి నమ్గ్యా ఖంపా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. ప్రధాని మోడీకి ఆహ్వానం అందినప్పటికీ, భారత్ ఈ బోర్డులో సభ్యత్వానికి ఇప్పటి వరకు దూరంగానే ఉంది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ, నార్వే వంటి దేశాలు కూడా భారత్ తరహాలోనే పరిశీలక హోదాలోనే భేటీకి వెళ్లాయి.
ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయమా?
ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ మండలి ఐక్యరాజ్యసమితికి పోటీగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐరాస తన సామర్థ్యాన్ని ఎప్పుడూ నిరూపించుకోలేకపోయిందని విమర్శించిన ట్రంప్.. ఈ బోర్డు ఐరాసను సరిగ్గా నడిచేలా పర్యవేక్షిస్తుందని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు ఈ విషయంలో వెనకాడుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనతో అటలాడితే సాగవని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి కూడా బుధవారమే అత్యవసర సమావేశం నిర్వహించడం గమనార్హం.
హమాస్ నిరాయుధీకరణే కీలకం
గాజా అభివృద్ధి కోసం కజకిస్థాన్, అజర్‌బైజాన్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాలు నిధుల హామీ ఇచ్చినా, మొత్తం పునర్నిర్మాణానికి అవసరమైన 70 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మరోవైపు హమాస్‌ను నిరాయుధులను చేయడం అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది. హమాస్ దీనిపై ఇంకా సానుకూల సంకేతాలు ఇవ్వలేదని, అయినప్పటికీ తాము ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు.
