
గాంధీ భవన్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు
రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్‌కు బీఆర్ఎస్ నేతలే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరగడానికి కేటీఆర్ బాధ్యత వహించాలని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. గతంలోనే తాను కేటీఆర్‌కు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని ఛాలెంజ్ చేశానని, ఇప్పుడు మళ్లీ అదే ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. దమ్ముంటే కేటీఆర్ ఆ ఛాలెంజ్‌ను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘటనతో రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య మరోసారి బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈగల్ టీమ్ దాడుల్లో డ్రగ్స్‌తో కొందరు నాయకులు పట్టుబడిన ఘటనల నేపథ్యంలో కేటీఆర్ ఈ విషయంపై స్పష్టంగా స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. డ్రగ్స్ విషయంలో జరిగిన తప్పులను ఒప్పుకుని ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కట్టుబడి ఉందని వెంకట్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో డ్రగ్స్ టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులకే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం ద్వారా సమాజానికి మంచి సందేశం వెళ్తుందని అన్నారు. అలాగే డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్‌కు వినతి పత్రం అందజేసినట్లు వెంకట్ వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి గత పదేళ్లలో గ్రామాల వరకూ విస్తరించిందని, దాన్ని అరికట్టేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
