Let's talk: editor@tmv.in
గాంధీ, ఇందిరా, రాజీవ్‌ గాంధీలను ఎవరు చంపారు?: ముఫ్తీ మొహబుబా

గాంధీ, ఇందిరా, రాజీవ్‌ గాంధీలను ఎవరు చంపారు?: ముఫ్తీ మొహబుబా

Pinjari Chand
11 నవంబర్, 2025

జమ్మూ కశ్మీర్‌ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు ముఫ్తీ మొహబుబా, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఘాటుగా ప్రతిస్పందించారు. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో 360 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం చేసుకున్న ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన అనంతరం, గిరిరాజ్‌ సింగ్‌ అరెస్టయ్యేవారు ఎప్పుడూ ఒకే కమ్యూనిటీకి చెందినవారే అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. దీని పై ప్రతిస్పందిస్తూ ముఫ్తీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గిరిరాజ్‌ జీ ముందుగా చెప్పాలి. గాంధీజీని ఎవరు చంపారు? ఇందిరా గాంధీని ఎవరు చంపారు? రాజీవ్‌ గాంధీని ఎవరు చంపారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే మాట్లాడతాం అని ఆమె తీవ్రంగా విమర్శించారు.

గిరిరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ 1993 ముంబై బాంబు పేలుళ్లను గుర్తు చేస్తూ, ఫరీదాబాద్‌ ఘటన అంతకంటే కూడా ప్రమాదకరమైనది అని అన్నారు. “బాబా బగేశ్వర్‌ యాత్రలో వేలాది మంది ఉన్నారు. వారు దాడికి గురయ్యుంటే ఏమయ్యేది? ఢిల్లీ ఏమయ్యేది. కానీ ప్రతి సారి పట్టుబడేవాడు ఒకే మతానికి చెందినవాడు. ఇప్పుడు అరెస్ట్‌ అయినవాడు ఒక ముస్లిం డాక్టర్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. చదువు లేనందు వల్లే ఉగ్రవాదులుగా మారారని చెప్పడానికి కూడా లేదు. పట్టుబడిన వారు ఉన్నత చదువులు చదువుకున్నారు. అలాగే రాహుల్‌ గాంధీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌, అసదుద్దీన్‌ ఓవైసీ వంటి నాయకులు ఇటువంటి ఘటనలపై మౌనం వహిస్తున్నారని విమర్శించారు.

“టెర్రరిజానికి మతం లేదంటారు. అయితే ఎందుకు ప్రతి సారి పట్టుబడే ఉగ్రవాది ముస్లిం మతానికి చెందినవాడు అవుతున్నాడు?” అని గిరిరాజ్‌ సింగ్‌ ప్రశ్నించారు. పహల్గాం ఘటన కూడా ఇదే విధంగా జరిగింది. ఈ ఘటనలో జమ్మూ కశ్మీర్‌ పోలీసులు డాక్టర్‌ ముజమ్మిల్‌, ఆదిల్‌ రాథర్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసి, వారి దగ్గరి నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

గాంధీ, ఇందిరా, రాజీవ్‌ గాంధీలను ఎవరు చంపారు?: ముఫ్తీ మొహబుబా - Tholi Paluku