
గాంధీ ఆసుపత్రిలో సరికొత్త చరిత్ర: ప్రభుత్వ ఉచిత ఐవిఎఫ్ ద్వారా తొలి చిన్నారి జననం!
తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఐవిఎఫ్ సెంటర్ ద్వారా చికిత్స పొందిన ఒక మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వ రంగంలో ఉచితంగా సంతాన సాఫల్య చికిత్స అందించి, ఒక ప్రాణాన్ని భూమిపైకి తీసుకురావడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఈ విజయం అటు వైద్యుల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
ఖరీదైన కార్పొరేట్ వైద్యంగా ముద్రపడిన సంతాన సాఫల్య చికిత్సను పేదలకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో, తెలంగాణ ప్రభుత్వం 2023లో గాంధీ ఆసుపత్రిలో ఈ అత్యాధునిక ఐవిఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించింది. సుమారు రూ. 5 కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌లో అధునాతన యంత్రాలు, ఎంబ్రియాలజీ విభాగాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సేవలు మొదలయ్యాయి.
వైద్యుల సమిష్టి కృషి - ఆధునిక సాంకేతికత:
ఈ ఘనత సాధించడంలో గాంధీ ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగం, ఐవిఎఫ్ నిపుణుల బృందం చేసిన కృషి వెలకట్టలేనిది. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ చికిత్స విజయవంతం కావడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చింది, ఇది కేవలం ఒక బిడ్డ జననం మాత్రమే కాదు.. వేలాది మంది సంతానం లేని దంపతుల నమ్మకానికి నిదర్శనం" అని వైద్య బృందం ఈ సందర్భంగా పేర్కొంది.
ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన వైద్యసేవలు, ఆధునిక సాంకేతికత, నిపుణులైన వైద్యుల సమిష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. ఖరీదైన ఐవిఎఫ్ చికిత్సను సామాన్యులకు ఉచితంగా అందించాలన్న ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చిందని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. ఇది రాష్ట్రంలోని అనేక మంది పిల్లలులేని దంపతులకు ఆశాకిరణంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు.
మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు:
ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆసుపత్రి ఐవిఎఫ్ సెంటర్ బృందాన్ని ప్రత్యేక్షంగా కలిసి ఘనంగా సత్కరించారు. వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించగలమని ఈ ఘటన నిరూపించిందని కొనియాడారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరిస్తామని, పేద దంపతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
