Let's talk: editor@tmv.in
గాంధీనే వదల్లేదు.. నేనెంత: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే

గాంధీనే వదల్లేదు.. నేనెంత: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే

Dantu Vijaya Lakshmi Prasanna
18 అక్టోబర్, 2025

ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం మరోసారి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల తీరుపై విరుచుకుపడ్డారు. ఆ రెండిటి ప్రజా సమావేశాల పద్ధతిని "సమాజానికి అత్యంత విషపూరితమైనది"గా అభివర్ణించారు. వీరి భావజాలం మహాత్మా గాంధీ మరణానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కొన్న ఎదురుదెబ్బలతో ముడిపడి ఉందని అన్నారు. ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ "నేను ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఆధారంగా, ప్రభుత్వ సంస్థలు, ప్రజా సంఘాలు బహిరంగ ప్రదేశాలలో ఎలా సమావేశమవ్వాలి అనే విషయానికి సంబంధించి ఉన్న అన్ని నియమాలు, చట్టాలను ఏకీకృతం చేసి, కొత్త నియమాన్ని తీసుకురావాలని క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం “ఎవరైనా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే, తప్పనిసరిగా అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి. అలా చేయని వారు దేశ చట్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది" అని అన్నారు. అలాగే సివిల్ సర్వీస్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వేతర కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వారిని సస్పెండ్ చెయ్యాలి అని అన్నారు.

“ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఆలోచనా విధానం అంతిమంగా మహాత్మా గాంధీ మరణానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటమికి దారితీసింది. ఇది సమాజానికి అత్యంత విషపూరితమైనది. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై స్పందిస్తూ గాంధీ, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులనే వాళ్ళు వదిలిపెట్టనప్పుడు, నేను ఎవరిని?" అని ఖర్గే అన్నారు. “బిజేపి వాళ్ళు ఆర్‌ఎస్‌ఎస్ తరఫున ఎందుకు మాట్లాడుతున్నారు? ఆర్‌ఎస్‌ఎస్ తనను తాను సమర్థించుకోలేదా?" అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా బీజేపీ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతోందని ఆరోపించారు. "నాపై వ్యక్తిగత దూషణలు చేయడం మానేసి, నేను అడిగిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలి” అని అన్నారు.

సివిల్ సర్వీస్ అధికారులపై చర్యలు

ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు పాల్గొని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఖర్గే ఆరోపించారు, ఈ నేపథ్యంలో అలాంటి కార్యక్రమాలలో పాల్గొనే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖను ఆయన సమర్థించుకున్నారు. సివిల్ సర్వెంట్లు తమ ప్రవర్తనలో రాజకీయ తటస్థత పాటించాలని కోరే కర్ణాటక రాష్ట్ర సివిల్ సర్వీస్ (కండక్ట్) రూల్స్, 2021ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతకుముందు, రూల్ 5(1) ఉల్లంఘనను ప్రస్తావిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గొనే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.

కర్ణాటక రాష్ట్ర సివిల్ సర్వీస్ (కండక్ట్) రూల్స్, 2021లోని రూల్ 5(1) ప్రకారం, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రాజకీయ పార్టీలో లేదా రాజకీయాలలో పాల్గొనే ఏదైనా సంస్థలో సభ్యుడిగా ఉండకూడదు, దానికి అనుబంధంగా ఉండకూడదు, అలాగే అతడు రాజకీయ ఉద్యమం లేదా కార్యకలాపాలలో పాల్గొనకూడదు, దానికి సహాయం అందించకూడదు, మరే ఇతర పద్ధతిలోనూ సహాయపడకూడదు.

"ఇది నేను పెట్టిన నియమం కాదు. ఇది కర్ణాటక సివిల్ సర్వీస్ నియమం. ఇందులో రాజకీయ కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. చాలా మంది పిడిఓలు, గ్రామ అకౌంటెంట్లు, ఇతర రాష్ట్ర అధికారులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలకు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి 2021 సివిల్ సర్విస్ విధి విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు, వారిని సస్పెండ్ చేయనున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమాచారం కోరగా "నేను బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. నేను ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశాను. ఒకటి, రెండు రోజుల్లో వారు సస్పెండ్ అవుతారు" అని మంత్రి ఖర్గే చెప్పారు.

సివిల్ సర్వెంట్లు నియమాలకు కట్టుబడి ఉంటే, ఏదైనా సిద్ధాంతాన్ని అనుసరించడంలో ఎటువంటి సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. "రాష్ట్ర క్యాడర్‌లోని సివిల్ సర్వెంట్లు పాటించాల్సిన ఒక నిబంధన ఉంది. దానిని అమలు చేయాలని మాత్రమే మేము అడుగుతున్నాము. ఎవరైనా ఏదైనా సంఘాన్ని లేదా ఏదైనా సిద్ధాంతాన్ని అనుసరించడంలో మాకు ఎటువంటి సమస్య లేదు. కానీ మీరు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలంటే, మీరు కొన్ని నియమాలను పాటించాలి" అని ఆయన అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని తాను చేసిన అభ్యర్థనపై వచ్చిన వివాదంపై స్పందిస్తూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సిలబస్‌కు (పాఠ్య ప్రణాళికకు) వెలుపల ఉన్న కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వకూడదని ఆయన అన్నారు.

ఖర్గేకు బెదిరింపు కాల్స్‌‌పై హోమ్ మంత్రి ప్రకటన

ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను పరిమితం చేయాలనే వ్యాఖ్యలకు గానూ ప్రియాంక్ ఖర్గేకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన నివాసం వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది. దీనిపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ, “మంత్రి ప్రియాంక్ ఖర్గేకు వచ్చిన బెదిరింపు కాల్‌లను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. వాటి మూలం,ఉద్దేశాన్ని కనుగొనడానికి సమగ్ర దర్యాప్తు జరుగుతోంది’ అని అన్నారు. “ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకలాపాలను పరిమితం చేయాలని మంత్రి డిమాండ్ చేసి ఉండవచ్చు, ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది” అని అన్నారు.

గాంధీనే వదల్లేదు.. నేనెంత: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే - Tholi Paluku