Let's talk: editor@tmv.in
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

FL - YUGDR
25 సెప్టెంబర్, 2025

పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్‌ హ‌రేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ అధికారులు, స్పెషల్ అధికారులు, జోనల్ కమిషనర్లు అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష చేప‌ట్టారు. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు. మంచి పురోగతి సాధించిన అధికారులను అభినందిస్తూ వెనుకబడిన వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.

మార్చి 2026 నాటికి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉన్నందున సంబంధిత అధికారులందరూ పేదల గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని క‌లెక్ట‌ర్ సూచించారు. మార్చి నాటికి పూర్తి చేయ‌క‌పోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అదనంగా ఇస్తున్న ఆర్థిక సహాయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ఈ అదనపు సహాయంతో ఇంటి నిర్మాణం పూర్తి అవుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు డ్రైనేజీలు తదితర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి గృహ నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలన్నారు.

పూర్తయిన గృహాలకు కాంట్రాక్టర్‌తో మాట్లాడి త‌లుపులు ఏర్పాటు చేయించాల‌న్నారు. స్టేజ్ కన్వర్షన్ పై దృష్టి పెట్టాలని, ప్రతి సచివాలయంలో జియో ట్యాగింగ్ పూర్తి చేయ‌డానికి ప్రణాళిక రూపొందించాలని, స్వచ్ఛందంగా ఇంటి నిర్మాణానికి ముందుకొచ్చేవారికి అవసరమైన సహకారం అందించడం ద్వారా ప్ర‌తి వారం మెరుగైన ప్రగతి సాధించాలన్నారు. ఖాళీగా ఉన్న చోట‌ స్థలాలు కేటాయించేటప్పుడు పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా ఇవ్వాలన్నారు. ఇళ్ల‌ నిర్మాణాల లక్ష్యసాధనలో వెనుకబడిన వారిపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంచార్జి హౌసింగ్ పీడీ సూరిబాబు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, హౌసింగ్ డీఈలు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి - Tholi Paluku