Let's talk: editor@tmv.in
గవాయ్ పేరు న్యాయవ్యవస్థలో చిరస్థాయిగా నిలుస్తుంది: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​

గవాయ్ పేరు న్యాయవ్యవస్థలో చిరస్థాయిగా నిలుస్తుంది: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​

Pinjari Chand
13 అక్టోబర్, 2025

భారతీయ న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొనియాడారు. ఆదివారం జస్టిస్ ఎస్. సి. ధర్మాధికారి రచించిన ‘ది గ్రేట్ లీగల్ ల్యూమినరీ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్’ అనే పుస్తకాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్ తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీఆర్ గవాయ్ న్యాయవ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి న్యాయ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆయన నాయకత్వంలో న్యాయ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు చారిత్రాత్మకమని చెప్పారు.

ప్రత్యక్ష ప్రసారంలో న్యాయ విచారణలు

ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బాంబే హైకోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసే వ్యవస్థను ప్రారంభించారు. అనేక కేసుల వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రజలకు విలువైన సమాచారాన్ని అందించే ఒక పెద్ద మార్పు. ఇలాంటి మార్పులు మరింత వేగంగా సాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గవాయ్ గారి కృషి న్యాయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేసిందని సీఎం ఫడ్నవీస్ అన్నారు. అలాగే కోర్టులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, జడ్జీల ఖాళీల భర్తీ, మానవ వనరుల పెంపు వంటి అంశాల్లో గవాయ్ నాయకత్వం ప్రశంసనీయమైందన్నారు.

ప్రజాస్వామ్య బలం ‘రాజ్యాంగం’ : ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్‌. గవాయ్

ప్రజాస్వామ్య బలానికి డాక్టర్ బి.ఆర్‌.అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం దేశ ఐక్యతకు,సమగ్రతకు పునాది వేసిందన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగమే మన దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. అలాగే యుద్ధం, శాంతి సమయాల్లోనూ, అంతర్గత అత్యవసర పరిస్థితుల్లోనూ మన దేశం ఐక్యతగా నిలబడడానికి రాజ్యాంగమే కారణమన్నారు. రాజ్యాంగ బలం వల్లే మన దేశం బలంగా నిలిచిందని లేకుంటే పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలాగా దేశంలో అల్లర్లు చెలరేగి హింసాత్మకంగా మారేదన్నారు. అంబేడ్కర్ చెప్పినట్లు ఈ దేశంలో సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకపోతే రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని ఆయన గుర్తు చేశారు. అంబేడ్కర్ కలగన్నట్టు దేశంలోని న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను విస్తరిస్తున్నామని, న్యాయ సేవలను గ్రామాల దాకా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సమానత్వ దృష్టిని నెరవేర్చుతున్నాయని ఆయన వివరించారు. ప్రతీ పౌరుడి ఇంటి ముంగిట్లోకి న్యాయం చేరేలా మేం న్యాయ వ్యవస్థను వికేంద్రీకరిస్తున్నాం. అందుకే ప్రతి ప్రాంతంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.

గవాయ్ పేరు న్యాయవ్యవస్థలో చిరస్థాయిగా నిలుస్తుంది: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ - Tholi Paluku