Let's talk: editor@tmv.in
గవర్నర్ వాకౌట్..కర్ణాటక శాసనసభలో ఉద్రిక్తత

గవర్నర్ వాకౌట్..కర్ణాటక శాసనసభలో ఉద్రిక్తత

Pinjari Chand
23 జనవరి, 2026

కర్ణాటక శాసనసభ సంయుక్త సమావేశంలో గురువారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండా తనకు నచ్చిన విధంగా మాట్లాడారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, గవర్నర్ తన విధులు, బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలయ్యారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం శాసనసభ సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవాల్సిందేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163 స్పష్టంగా పేర్కొంటున్నాయని సీఎం గుర్తుచేశారు. కానీ ఈసారి గవర్నర్ కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని పక్కనపెట్టి, తానే సిద్ధం చేసుకున్న మాటలను మాట్లాడారని తెలిపారు. ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో బొమ్మలా వ్యవహరిస్తున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వ విధానాలపై, ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ఈగా పథకం, నిధుల పంపిణీ వంటి అంశాలపై విమర్శలు ఉన్న 11 పేరాగ్రాఫ్‌లను ప్రసంగం నుంచి తొలగించాలని గవర్నర్ కోరినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పూర్తి ప్రసంగం చదవకుండా కేవలం రెండు పంక్తులతో తన ప్రసంగాన్ని ముగించినట్టు సీఎం ఆరోపించారు.

పూర్తి ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్

కర్ణాటక శాసనసభ సంయుక్త సమావేశంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రభుత్వం సిద్ధం చేసిన పూర్తి ప్రసంగాన్ని చదవకుండా మధ్యలోనే సభను విడిచిపెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ తన సాంప్రదాయిక ప్రసంగంలో కేవలం తొలి, చివరి పంక్తులు మాత్రమే చదివి సభ నుంచి నిష్క్రమించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందిస్తూ, గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపడతామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సభ నుంచి గవర్నర్ బయటకు వెళ్లే సమయంలో కాంగ్రెస్ నేత బీకే హరిఫ్రసాద్ ఆయనను అడ్డుకుని పూర్తి ప్రసంగం చదవాలని కోరగా, గవర్నర్ నిరాకరించినట్లు తెలిసింది. ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రసంగంలో ఉన్న అంశాలు వాస్తవాలే

ఈ విషయంపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ ఆర్టికల్ 176, 163లను ఎవరు ఉల్లంఘిస్తున్నారు? గవర్నర్ కార్యాలయం బీజేపీ కార్యాలయంగా మారిందా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రసంగంలో ఉన్న అంశాలన్నీ ప్రజాసంబంధమైన వాస్తవాలేనని, అవే అంశాలను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్డీపీఆర్ మంత్రికి సమర్పించామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం చేయడం తప్పనిసరి విధి అని ఖర్గే స్పష్టం చేశారు. ఒక పేరాగ్రాఫ్ అయినా అసత్యమైతే చదవకండి. కానీ ప్రజా ప్రయోజనాలపై ఉన్న ఈ 11 పేరాగ్రాఫ్‌లను ఎందుకు చదవరు? అని ప్రశ్నించారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఈ ఘటనను ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ తన బాధ్యతలను విస్మరించారని విమర్శించారు. అయితే ఈ అంశంపై శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్ స్పందిస్తూ, గవర్నర్‌–ప్రభుత్వం మధ్య ఎలాంటి ఘర్షణ లేదని, రాజ్యాంగ సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయని వ్యాఖ్యానించారు.ఇటీవలి రోజుల్లో తమిళనాడు, కేరళలోనూ గవర్నర్ల ప్రసంగాల విషయంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.