Let's talk: editor@tmv.in
గవర్నర్‌ను మేడారం జాతరకు ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గవర్నర్‌ను మేడారం జాతరకు ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Gaddamidi Naveen
24 జనవరి, 2026

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు హాజరుకావాల్సిందిగా గవర్నర్‌కు మంత్రి ఆహ్వానం పలికారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతర ప్రాముఖ్యతను మంత్రి గవర్నర్‌కు వివరించారు.

ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం జాతరకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారని, ఇది గిరిజనుల విశ్వాసం, ఆచారాలకు అద్దం పడుతుందన్నారు. సమ్మక్క–సారలమ్మల గాథ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని తెలిపారు.

జాతర సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు అందించే సౌకర్యాల గురించి కూడా మంత్రి వివరించారు. ఈ ఆహ్వానానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందిస్తూ, జాతర విశిష్టతపై ఆసక్తి వ్యక్తం చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026, జనవరి 28న ప్రారంభమవుతుంది. జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగుతుంది. జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశంతో ఉత్సవాలు ముగుస్తాయి.