Let's talk: editor@tmv.in
గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు: మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్

గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు: మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్

Gaddamidi Naveen
31 మార్చి, 2026

తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ సెగలు రేగుతున్నాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సోమవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం లోక్ భవన్ లో గవర్నర్‌తో దాదాపు గంటసేపు సమావేశమై, మంత్రిపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించింది.

గవర్నర్‌ను కలిసిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మూడు ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి పొంగులేటిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు.హైకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి.రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం కోరాలని గవర్నర్‌ను అభ్యర్థించారు.

మంత్రికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా జంట జలాశయాల క్యాచ్‌మెంట్ ఏరియా వంటి నిషేధిత ప్రాంతాల్లో కూడా కార్యకలాపాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు, విద్యుత్, పారిశ్రామిక క్లియరెన్సులు లేకుండానే వందల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను పునరావృతం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. నాడు ఎమర్జెన్సీ సమయంలో గవర్నర్ కూడా జైలు శిక్ష అనుభవించారు. నేడు తెలంగాణలో కూడా అప్రజాస్వామిక పాలన సాగుతోందని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాలను లేవనెత్తితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని అన్నారు.

హోం శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున, రాష్ట్ర ఏజెన్సీలైన సిబి-సిఐడి విచారణపై తమకు నమ్మకం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి పదవిలో ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున పొంగులేటిని వెంటనే తొలగించాలన్నారు. అలాగే ఈ విషయంలో బీజేపీ మౌనం వహించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెద్ద బ్లాక్ మెయిలర్ అని సంబోధిస్తూ.. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే పొంగులేటి అక్రమాలతో పాటు అమృత్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, సింగరేణి అవకతవకలపై కూడా విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తన పోరాటాన్ని ఆపదని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ వినతిపై స్పందించిన గవర్నర్, ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.